అప్పుడు చిరు కోసం కొరటాల.. ఇప్పుడు పీకే కోసం హరీశ్ శంకర్!
on Jun 25, 2022

గతంలో 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం కోసం గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. 2019 ఎన్నికల తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కరోనా మహమ్మారి లేనట్లయితే ఈ సరికి మరిన్ని సినిమాలు ఆయన నుంచి వచ్చేవే. కాగా, మరోసారి జనసేన పార్టీ కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశంతో సినిమా షూటింగ్‌లకు తాత్కాలిక విరామం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ఇప్పటికే అంగీకరించిన, షూటింగ్ ప్రారంభం కాని సినిమాల పరిస్థితేమిటనే ప్రశ్న అభిమానుల్లో రేకెత్తుతోంది.
క్రిష్ డైరెక్షన్‌లో నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీని సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగా షెడ్యూల్స్‌ను నిర్మాత ఎ.ఎం. రత్నం ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో నటిస్తున్న 'వినోదాయ సీతమ్' రీమేక్‌ను కూడా ఈలోగా ఆయన పూర్తి చేయనున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు సముద్రకని దర్శకుడు. జూలైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.
మరైతే హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఎనౌన్స్ చేసిన 'భవదీయుడు భగత్ సింగ్' పరిస్థితి ఏమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ఇటీవల 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్'ను త్వరలోనే ప్రారంభిస్తానని స్వయంగా ప్రకటించాడు పవన్. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అర్థం కాని స్థితి ఏర్పడిందంటున్నారు. నిజానికి ఆ మూవీని అనౌన్స్ చేసి ఏడాది పైనే గడిచింది. ఇప్పటిదాకా సెట్స్ మీదకు వెళ్లడానికి నోచుకోలేదు. ఈ ఏడాది ఆ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువ అనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం హరీశ్ శంకర్ పరిస్థితిని ఇదివరకటి కొరటాల శివ పరిస్థితితో పోలుస్తున్నారు జనం. 'భరత్ అనే నేను' మూవీ తర్వాత చిరంజీవితో సినిమా చేయడానికి కమిట్ అయిన కొరటాల శివ, ఆయనతో 'ఆచార్య' తీయడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో గద్దలకొండ గణేశ్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌తో సినిమా తియ్యాలనుకున్న హరీశ్ శంకర్ కూడా అదే విధంగా మూడేళ్లు ఎదురుచూపులతో గడపాల్సిన స్థితి. వచ్చే సెప్టెంబర్‌కు గద్దలకొండ గణేశ్ విడుదలై మూడేళ్లు పూర్తవుతాయి. ఈలోగా భవదీయుడు భగత్‌సింగ్ పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. దాంతో హరీశ్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ కోసం మరో సినిమా చేయకుండా ఎదరుచూపుల్లోనే మూడేళ్లు గడిపినట్లవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



