Home

»

Latest News

ఏడుగురు భామల ‘హ్యాపీ జర్నీ’, ‘సీతాకోకలా..‘ లిరికల్ సాంగ్ రిలీజ్.!

Aug 5, 2026 5:39PM

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల విదేశీ ప్రయాణం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా 'సీతాకోకలా...' అంటూ సాగే మధురమైన గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ సరికొత్త లవ్లీ మెలోడీకి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతమైన స్వరాలను సమకూర్చగా, ప్రముఖ గేయ రచయిత సురేష్ బానిసెట్టి ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తన అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటను పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఆడవారి స్వేచ్ఛకు, వారి కలలకు ఎలాంటి హద్దులూ లేవనే సందేశాన్ని ఇస్తూ ఈ సాంగ్ సాగుతుంది.

ఈ సినిమాలో పారిస్, మాంట్‌పెలియర్ వంటి యూరప్‌లోని అత్యంత సౌందర్యాత్మక ప్రాంతాలలో చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణం నేపధ్యంలో సాగే కథ అయినప్పటికీ, ఇందులో చూపించే మనుషుల అనుబంధాలు, స్నేహం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీలతో పాటు పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ మరియు సునైనా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అలరించనున్నారు. అంతేకాకుండా పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిశ్రమకు పరిచయం అవుతుండగా, బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన రెస్పాన్స్ లభించగా, ఇప్పుడు విడుదలైన 'సీతాకోకలా' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సంగీతప్రియులు ఈ పాటలోని లిరిక్స్ మరియు యూరప్ విజువల్స్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com