డ్యూయల్ రోల్‌తో పరిచయమైన హీరో!
on Feb 12, 2019

ఫ్యామిలీ చిత్రాలకు, ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు జగపతిబాబు. ఆయన రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోనే. ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసిన అసలలై హీరో. ఎవరికీ భయపడని నైజం...ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా, నిజాయితీగా, ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం.`` మొదట్లో కొంత మొహమాటానికి పోయి ...కొన్ని సినిమాలు ఒప్పుకున్నా ...ఆ సినిమాలు నా కెరీర్ ను పతాక స్థాయి నుంచి పతనం వైపు తీసుకెళ్లాయి `` అంటూ చెప్పకనే చెప్పారు కొన్ని ఇంటర్య్వూస్ లో జగ్గూభాయ్.
తొలి సినిమాతోనే డ్యూయల్ రోల్ చేసి సినిమా ఇండస్ట్రీని ఆకర్షించిన జగపతి బాబు హీరోగా వరుస పరాజయాలు అందుకున్నాడు. అయినా మొండి మనిషైన జగపతి బాబు సక్సెస్ వచ్చేదాకా పట్టు పట్టు వదలకుండా శ్రమిస్తూ జగన్నాటకం, పెద్దరికం చిత్రాలతో సక్సెస్ బాట పట్టాడు. ఇక వర్మ దర్శకత్వంలో వచ్చిన `గాయం` చిత్రంతో తనలోని నటుణ్ని పరిశ్రమకు పరిచయం చేసుకున్నాడు. ఆ సినిమాతో నే తను సొంత డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించాడు. యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన `శుభలగ్నం` చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైన జగపతిబాబు వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మహిళలకు చేరువయ్యాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్, మార్కట్ ఏర్పాటు చేసుకున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన `అంతఃపురం, సముద్రం , అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన `మనోహరం` చిత్రాలు జగతపి బాబు నట విశ్వరూపాన్ని చూపించాయి. ఇక ఆ తర్వాత చేసిన చాలా చిత్రాలు ఆయన్ను అపజయాలు వైపు నడిపించాయి. ఈ క్రమంలోనే ఆర్థికంగానూ కొంత దెబ్బ తిన్న జగపతి బాబు చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు.
కొత్త తరం, కొత్తదనం వస్తోన్న ఈ తరుణంలో ఇంకా హీరోగా కొనసాగడం కష్టం అని తెలుసుకున్న జగపతిబాబు కొత్త అవతారం ఎత్తాడు. `` ఇంతకాలం హీరోగా అలరించాను... ఇకపై విలన్ గా ఆకట్టుకోవాలనుకుంటున్నా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా`` అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జగపతి. ఇందులో భాగంగానే బాలకృష్ణ నటించిన ` లెజెండ్` చిత్రంలో విలన్ గా నటించి న్యూ ట్రెండ్ సృష్టించాడు జగ్గూభాయ్. విలన్ అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో నెగిటివ్ పాత్రల్లో నటించి దేన్నైనా పాజిటివ్ గా తీసుకోగల సత్తా ఉన్న రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న జగపతి బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్. ఈ రోజు విడుదలైన `సైరా` లోని జగపతి బాబు లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



