'సీతారామం' దర్శకుడితో ప్రభాస్ మూవీ!
on May 19, 2023

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. స్టార్ దర్శకులతో కంటే కూడా యంగ్, మీడియం రేంజ్ దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ప్రభాస్ మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు హను రాఘవపూడి.
'అందాల రాక్షసి'తో దర్శకుడిగా పరిచయమైన హను.. ప్రేమ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గతేడాది విడుదలైన 'సీతా రామం' క్లాసిక్ హిట్ గా నిలిచి, ఆయనకు మరింత పేరు తీసుకొచ్చింది. దాని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈసారి ఆయన స్టార్ హీరోతోనే సినిమా చేస్తాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఊహించినట్లుగానే హను తన తదుపరి సినిమాని ప్రభాస్ తో చేయబోతున్నట్లు సమాచారం. హను తన స్టోరీతో ఇప్పటికే ప్రభాస్ ని ఇంప్రెస్ చేసినట్లు వినికిడి. ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. ప్రేమకథలు తీయడంలో దిట్ట అయిన హను.. ప్రభాస్ తో మాత్రం ప్రేమ కథ తీయడం లేదని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. జూన్ 16న 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. 'సలార్', 'ప్రాజెక్ట్ కె'తో పాటు మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రాన్ని ప్రకటించాడు. వీటి తర్వాత హను చిత్రం పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



