ఐదుగురు మాస్ స్టార్స్.. వరుసగా ఐదు బ్యాడ్ ఫిలిమ్స్!
on May 4, 2020

కెరీర్‌లో పలు ఫ్లాపులున్నప్పటికీ, వరుసగా ఐదారు సినిమాలు ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో ఆకట్టుకోలేక పోయినప్పటికీ కొందరు నటులు.. స్టార్ హీరోలుగా తమ స్టామినా ఏమిటో ఆ తర్వాత నిరూపించుకున్నారు. మరికొందరు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మునుపటి తరంలో టాప్ స్టార్స్‌గా ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్రవేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి వాళ్లకే వరుస ఫ్లాపులు తప్పలేదు. హిట్ కోసం చాలా కాలం వాళ్లు ఎదురు చూసిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత తరం నుంచి ఇప్పటి తరం టాప్ స్టార్ల కెరీర్ చూసుకున్నా కొంతమందికి వరుసగా ఐదారు సినిమాలు డిజప్పాయింట్ చేసిన సందర్భాలు కనిపిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటివాడికే ఇలాంటి కష్టకాలం ఎదురవడం మనం చూడవచ్చు. ఆయనతో పాటు మిగతా టాప్ స్టార్స్‌లో ఇలా వరుసగా ఐదు సినిమాల దాకా హిట్ రాక కష్టపడ్డవాళ్లెవరో ఓ లుక్కేద్దాం...
చిరంజీవి

తొమ్మిదో దశకంలో మెగాస్టార్ చిరంజీవికి కష్ట కాలం ఎదురైంది. వరుస ఫ్లాపులతో ఆయన సతమతమయ్యాడు. అంతే కాదు.. ఒక సినిమా కారణంగా ఆయన ఇమేజ్ కూడా దెబ్బతింది. 1993లో వచ్చిన హిట్ మూవీ 'ముఠా మేస్త్రి' తర్వాత ఆయన నటించిన మెకానిక్ అల్లుడు (93), ముగ్గురు మొనగాళ్లు (94), ఎస్.పి. పరశురామ్ (94), అల్లుడా మజాకా (95), బిగ్ బాస్ (95), రిక్షావోడు (95) సినిమాలు బ్యాడ్ ఫిలిమ్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన 'అల్లుడా మజాకా' సినిమా అయితే బూతు సినిమాగా విమర్శల పాలయ్యింది. స్త్రీ పాత్రలను మరీ నాసిరకంగా చూపించారనీ, అత్తా అల్లుళ్లుగా నటించిన లక్ష్మి, చిరంజీవి మధ్య సీన్లు శ్రుతి మించి, అసభ్యకరంగా ఉన్నాయనీ చెడ్డపేరు వచ్చింది. ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ కూడా గట్టిగా వినిపించింది. చివరకు 1997లో వచ్చిన 'హిట్లర్' మూవీ ఘన విజయంతో బ్యాడ్ ఫిలిమ్స్ పరంపరకు చిరంజీవి చెక్ చెప్పారు.
బాలకృష్ణ

21వ శతాబ్ది ఆరంభంలో బాగానే ఉన్నట్లనిపించిన నందమూరి బాలకృష్ణ కెరీర్ ఒక్కసారిగా దబేల్ దిబేల్ మంది. 2004లో వచ్చిన 'లక్ష్మీ నరసింహా' మూవీ హిట్టయ్యాక, మరో హిట్ కోసం ఆయన ఆరేళ్ల కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. విజయేంద్రవర్మ (04), అల్లరి పిడుగు (05), వీరభద్ర (06), మహారథి (07), ఒక్క మగాడు (08), పాండురంగడు (08), మిత్రుడు (09) సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపవడమే కాకుండా, చెత్త సినిమాలుగా విమర్శలకు గురయ్యాయి. ఎట్టకేలకు 2010లో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన 'సింహా' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మాస్ స్టార్‌గా తన స్టామినా ఏమిటో బాలయ్య నిరూపించాడు.
నాగార్జున

టాలీవుడ్ మన్మథుడిగా కీర్తి పొందిన అక్కినేని నాగార్జున కెరీర్ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 2016లో రిలీజైన 'ఊపిరి' మూవీలో వీల్ చైర్‌కే పరిమితమైన పాత్రలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్న ఆయనకు ఆ తర్వాత చేసిన ఓం నమో వేంకటేశాయ (17), రాజుగారి గది 2 (17), ఆఫీసర్ (18), దేవదాస్ (18), మన్మథుడు 2 (19) సినిమాలు దెబ్బకొట్టాయి. వీటిలో 'ఆఫీసర్', 'మన్మథుడు 2' సినిమాలైతే బాక్సాఫీస్ దగ్గర అతి తక్కువ కలెక్షన్లను వసూలు చేసి, స్టార్ హీరోగా ఆయనకున్న పేరును నవ్వులపాలు చేశాయి. ఈసారి హిట్ సాధించి తనేమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకుంది.
జూనియర్ ఎన్టీఆర్

యంగ్ స్టార్స్‌లో అతి తక్కువ కాలంలో అమితమైన ఇమేజ్ సాధించి, ఆ తర్వాత ఆ ఇమేజ్‌ను కొనసాగించలేక ఇబ్బంది పడ్డ స్టార్.. జూనియర్ ఎన్టీఆర్. హీరోగా నటించిన ఏడో సినిమా 'సింహాద్రి'.. తారక్ ఇమేజ్‌ను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించింది. మెగాస్టార్‌కు సిసలైన పోటీదారుడు వచ్చాడంటూ ఆ టైమ్‌లో తారక్‌ను అందరూ ఆకాశానికెత్తేశారు. అయితే రాజమౌళి రూపొందించిన ఆ సినిమాయే తర్వాత కాలంలో తారక్ ఇమేజ్‌కు అడ్డంకిగా మారింది. 'సింహాద్రి'గా అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో తారక్‌కు బ్రహ్మరథం పట్టిన ఆడియెన్స్.. ఆ తర్వాత ఆంధ్రావాలా (04), సాంబ (04), నా అల్లుడు (05), నరసింహుడు (05), అశోక్ (06), రాఖీ (06) మూవీస్‌లో అతడిని రిసీవ్ చేసుకోలేకపోయారు. తిరిగి రాజమౌళే తీసిన యమదొంగ (07) మూవీ హిట్ అవడంతో ఊపిరి పీల్చుకున్నాడు తారక్.
ప్రభాస్

ఇవాళ ఏకైక పాన్ ఇండియా స్టార్ కిరీటం ధరించిన బాహుబలి ప్రభాస్‌కు కూడా కెరీర్‌లో ఒడిదుడుకులున్నాయి. వరుసగా ఘోర ఫ్లాపులు చవిచూడకపోయినా ఒక పీరియడ్‌లో ఎక్కువగా యావరేజ్‌లతోటే సరిపెట్టుకున్నాడు ప్రభాస్. 2005లో రాజమౌళి రూపొందించిన 'ఛత్రపతి' మూవీతో మాస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అతనికి ఆ వెంటనే 'పౌర్ణమి' (06) రూపంలో డిజాస్టర్ ఎదురైంది. యోగి (07), మున్నా (07), బుజ్జిగాడు (08), బిల్లా (09) సినిమాలు ఫర్వాలేదనిపించే రేంజ్‌లో కలెక్షన్లు సాధించాయి కానీ హిట్ కాలేకపోయాయి. ఆ లోటును 2009లో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'ఏక్ నిరంజన్' మూవీ తీర్చింది. దాని తర్వాత ప్రభాస్ వెనుతిరిగి చూడాల్సిన అవసరం కలుగలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



