ఒకటి, రెండు కాదు.. ఐదు చోట్ల షారుఖ్ విల్లాలు! వాటి విలువ తెలిస్తే షాకే!!
on Nov 27, 2020
కింగ్ ఆఫ్ బాలీవుడ్ అనీ, బాలీవుడ్ బాద్షా అనీ షారుఖ్ ఖాన్‌ను ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. నిజంగానే ఆయనది కింగ్ సైజ్ లైఫ్‌స్టైల్. ఆయ అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతుంటాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఆయనదే. ఇక ఐదు ప్రాంతాల్లో ఆయనకు అత్యంత విలాసవంతమైన ఐదు విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాల విలువ తెలిస్తే.. మధ్యతరగతి వాళ్లకు కళ్లు బైర్లు కమ్ముతాయంతే!
మనదేశంలోని ముంబై, ఢిల్లీ, అలీబాగ్లతో పాటు దుబాయ్, లండన్లలోనూ షారుఖ్‌కు విల్లాలున్నాయి. ఒక అంచనా ప్రకారం సెంట్రల్ లండన్‌లోని పాష్ కాలనీ పార్క్ లేన్‌లో ఉన్న ఆయన విల్లా విలువ రూ. 172 కోట్లు! దుబాయ్‌లోని పామ్ జుమేరా ప్రాంతంలో ఉన్న జన్నత్ అనే లగ్జరీ ప్రైవేట్ ఐలాండ్ హోమ్ విలువ రూ. 20 కోట్ల పైమాటే. దీని విస్తీర్ణం 8500 చదరపు అడుగులు.
2001లో ముంబైలోని బాంద్రాలో విల్లా వియన్నాను కొనుగోలు చేశాడు షారుఖ్. 2005లో దానిని మన్నత్‌గా మార్చాడు. ముంబైలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో మన్నత్ ఒకటిగా మారింది. ప్రస్తుతం దాని విలువ సుమారు రూ. 200 కోట్లు! మహారాష్ట్రలోనే ముంబై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్ టౌన్లో బీచ్ దగ్గర 20 వేల చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో షారుఖ్‌కు స్థలం ఉంది. అందులో ఉన్న పెద్ద బంగళాతో కలిపి దాని నేటి విలువ ఏకంగా రూ. 250 కోట్లు!
అలాగే దక్షిణ ఢిల్లీలో, పంచశీల్ పార్క్ పక్కనే ఒక పెద్ద బంగళాకి కూడా షారుఖ్ యజమాని. దాని విలువ ఎంతనేది వెల్లడి కాలేదు. వీటిని బట్టి షారుఖ్ ఆస్తులు ఏ రేంజిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. 2018లో వచ్చిన 'జీరో' మూవీ తర్వాత రెండున్నరేళ్ల విరామంతో ఆయన 'పఠాన్' సినిమా చేస్తున్నారు.
Also Read