'వీరమల్లు'ని వీడని కష్టాలు.. సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం!
on May 29, 2023
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇది చాలదు అన్నట్టు తాజాగా మరో షాక్ తగిలింది. 'హరి హర వీరమల్లు' సెట్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం పవన్ చేతిలో 'హరి హర వీరమల్లు'తో పాటు 'బ్రో', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు ఉన్నాయి. నిజానికి 'హరి హర వీరమల్లు' సినిమా ఎప్పుడో ప్రారంభమైంది. అయితే ఇది పీరియాడికల్ ఫిల్మ్ కావడంతో ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుంది. మరోవైపు రాజకీయాలకు కూడా సమయం కేటాయించాల్సి ఉండటంతో, ముందుగా తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్. దీంతో 'హరి హర వీరమల్లు' ఆలస్యమవుతోంది.
'హరి హర వీరమల్లు' కోసం దుండిగల్ సమీపంలో భారీ సెట్ వేశారు. పవన్ సహా ఇతర ముఖ్య తారాగణంపై ఈ సెట్స్ లో పలు కీలక ఘట్టాలను చిత్రీకరించారు. ఆమధ్య భారీ వర్షాల కారణంగా సెట్ డ్యామేజ్ కావడంతో మరమ్మత్తులు కూడా చేయించారు. తదుపరి షెడ్యూల్ కూడా ఇక్కడే చిత్రీకరణ జరగాల్సి ఉండగా, ఊహించని విధంగా ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగనప్పటికీ, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఓసారి సెట్ డ్యామేజ్ అయ్యి మరమ్మత్తులు చేయించగా, ఇప్పుడు మళ్ళీ అగ్ని ప్రమాదం జరగడంతో మేకర్స్ తీవ్ర విషాదంలో ఉన్నారట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
