Home

»

Latest News

ప్రేమ కాస్తా అబ్సెషన్‌గా మారితే.. మరో సైకలాజికల్ థ్రిల్లర్ వ‌చ్చేస్తోంది.!

Oct 3, 2026 12:22PM

మలయాళం నుంచి వచ్చే క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ కథలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘ఐస్’ (Eyes). ‘ఉయరే’, ‘కాణెక్కాణే’ వంటి సినిమాలను తెరకెక్కించిన మను అశోకన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా ‘ఐస్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. క్రైమ్, సస్పెన్స్, సైకలాజికల్ అంశాలతో సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈ సిరీస్ అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

‘ఐస్’ కథ ప్రధానంగా మహిళలకు సంబంధించిన కొన్ని కలవరపరిచే కేసుల చుట్టూ తిరుగుతుంది. కని కుసృతి పోలీస్ అధికారిణి టీనా సెబాస్టియన్ పాత్రలో కనిపించనున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా స్టాకింగ్‌కు పాల్పడే వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి పోలీసులతో కలిసి మానసిక ఆరోగ్య నిపుణులు కూడా రంగంలోకి దిగుతారు. ప్రేమ, ఆకర్షణ, అబ్సెషన్, కంట్రోల్ మధ్య ఉండే సున్నితమైన గీత ఎలా భయానికి దారితీస్తుందనే అంశాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. దీంతో సాధారణ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా సైకలాజికల్ కోణంలో కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సిరీస్‌లో కని కుసృతితో పాటు నిఖిలా విమల్, శ్రుతి రామచంద్రన్, సనియా అయ్యప్పన్, దేవ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘ఉయరే’, ‘కాణెక్కాణే’ సినిమాలకు పనిచేసిన రచయిత ద్వయం బాబీ-సంజయ్ ఈ సిరీస్‌కు స్క్రీన్‌ప్లే అందించారు. డ్రీమ్ క్యాచర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టీఆర్ షంషుద్దీన్ నిర్మించారు. గౌతమ్ శంకర్ సినిమాటోగ్రఫీ, రంజిన్ రాజ్ సంగీతం అందించారు.

ఇక ‘ఐస్’ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ట్రైలర్‌లో చూపించిన సస్పెన్స్, క్రైమ్ అంశాలతో పాటు స్టాకింగ్, అబ్సెషన్ వంటి సున్నితమైన అంశాలను కథలో ఎలా చూపించారనేది తెలియాలంటే సిరీస్ విడుదల వరకు వేచి చూడాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com