ఈ మాయ పేరేమిటో...క్షమాపణ చెప్పారు
on Sep 22, 2018
ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమైన సినిమా 'ఈ మాయ పేరేమిటో'. ఇటీవలే ఈ సినిమా విడుదలయ్యింది. అయితే... నెల్లూరు, గుంటూరు, విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో సినిమా షోలు పడలేదు. తమ మతాన్ని కించపరిచేలా హీరో ఇంట్రడక్షన్ సాంగులో కొన్ని దృశ్యాలు, సినిమాలో సన్నివేశాలు వున్నాయని జైనులు ఆందోళనలు చేయడంతో షోలు పడలేదు. ముఖ్యంగా రెండో పాటలో హీరోయిన్‌ని బీచ్‌లో చూపించిన విధానాన్నీ, సాహిత్యాన్ని జైనులు తప్పు బడుతున్నారు. దీంతో 'ఈ మాయ పేరేమిటో' నిర్మాత దివ్యా విజయ్ మీడియా ముందుకొచ్చారు. జైనులకు క్షమాపణ చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.
వివాదం గురించి దివ్యా విజయ్ మాట్లాడుతూ "ఇంట్రడక్షన్ సాంగులో జైనుల మంత్రం ఒకటి వినిపిస్తుంది. దీనిపై జైనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్నింగులు ఇస్తూ మెస్సేజులు పెడుతున్నారు. హిందువులకు గాయత్రీ మంత్రాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో? జైనులు ఆ మంత్రాన్ని అంత పవిత్రంగా భావిస్తారని కొంతమంది చెప్పారు. మాకు ఆ సంగతి తెలియదు. తెలియక చేసిన పొరపాటుగా భావించి క్షమించాలని కోరుతున్నా. సినిమాలో మంత్రాన్ని తొలగిస్తున్నాం. దయచేసి ఎవరూ సినిమాను అడ్డుకోవద్దు. మాకు ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదు" అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
