ఎన్టీఆర్ డబ్బింగ్ కోసం వచ్చి షర్ట్ తీసి అవతల పడేశాడు!
on Jun 8, 2023
బి.గోపాల్.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిడుమనూర్ గ్రామంలో పుట్టాడు. పి. సి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'అడవిరాముడు' సినిమాకి కె. రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. దాదాపు పన్నెండు సంవత్సరాలు కె. రాఘవేంద్రరావు దగ్గర పనిచేసాక 'ప్రతిధ్వని' మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు.
ఆ తరువాత, అతను బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పల్నాటి బ్రహ్మనాయుడు, అడవి రాముడు మరియు నరసింహుడు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మారడంతో బి. గోపాల్ కెరీర్ గడ్డు దశకు చేరుకుంది. ఆ తర్వాత కొంతకాలం విరామం తర్వాత రామ్ పోతినేనితో 'మస్కా' సినిమాకి దర్శకత్వం చేయగా అది హిట్ సాధించింది.
బి. గోపాల్ తన కెరీర్ గురించి వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.ఎన్టీఆర్ తో సినిమాలు చేసారు కదా ఎలా ఉండేవారని అడుగగా.. ఆయనని దగ్గరినుండి చూడటమే నా అదృష్టం.. అలాంటిది ఆయనతో కలిసి పనిచేసాను. ఆయన చాలా సాదాసీదాగా ఉంటారని బి.గోపాల్ చెప్పాడు.
ఒకరోజు ఎన్టీఆర్ గారు డబ్బింగ్ స్టూడియోకి వచ్చారు. స్టూడియో అంతా ఫుల్ ఏసీ.. అందరం గజగజ వణుకుతున్నాం.. ఎన్టీఆర్ గారు వచ్చి షర్ట్ తీసేసి డబ్బింగ్ చెప్పేసారు. పూర్తి సినిమా డబ్బింగ్ ఒక రోజులో చెప్పేసేవారని బి.గోపాల్ చెప్పాడు. ఎన్టీఆర్ గారిని దగ్గరినుండి చూసాక .. ఎంత గొప్ప నటుడు.. ఇంత మాములుగా ఉంటాడా అని అనుకునేవాడిని.. మేం అసిస్టెంట్ డైరక్టర్స్ గా ఉండేవాళ్ళం.. మమ్మల్ని పిలిచి .. "బ్రదర్ మా డైలాగ్ డెలివరీ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి" అని అనేవారని బి.గోపాల్ చెప్పాడు. ఎన్టీఆర్ సెట్ లో ఎలా ఉండేవారని అడుగగా.. షూట్ 7 గంటలకి అయితే, పది పదిహేను నిమిషాల ముందే సెట్స్ లో ఉండేవారు. ఆలస్యంగా వచ్చినవాళ్ళని ఎందుకు ఆలస్యమైందని కూడా అడిగేవారు కాదాయన అని బి.గోపాల్ చెప్పుకొచ్చాడు. ఇలా బి.గోపాల్ తన సినిమా జీవితం ఎలా సాగిందో చెప్తూ, అలాగే ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని తెలుగువన్ తో పంచుకున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
