హేమమాలినితో పెళ్లి కోసం మతం మార్చుకున్న ధర్మేంద్ర!
on Aug 10, 2020

ధరమ్‌సింగ్ డియోల్ అంటే మనలో అనేకమందికి తెలీదు. ధర్మేంద్ర అంటే.. వెంటనే అలనాటి బాలీవుడ్ టాప్ స్టార్ అని చెప్పేస్తాం. దర్మేంద్ర, హేమమాలిని తెరపై హిట్ పెయిర్‌గా ఓ వెలుగు వెలిగారు. ప్రేమలో పడ్డారు. ఫలితంగా ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. దానికోసం ఆయన మతాన్ని మార్చుకున్న విషయం ఎంతమందికి తెలుసు? అవును. హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్యకు విడాకులివ్వకుండా రెండో పెళ్లికి చట్టబద్ధత ఉండదు కాబట్టి.. హేమమాలినితో పెళ్లి కోసం ఆయన ఇస్లాం మతంలోకి మారారు. అలా ఆయన రెండు సంసారాలను కొనసాగిస్తూ వస్తున్నారు.
మనందరికీ ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ గురించి కూడా ఏమీ తెలీదు. 1954లో ఆమెను ధర్మేంద్ర పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 19 సంవత్సరాలే! ఆ దంపతుల పిల్లలే సన్నీ డియోల్, బాబీ డియోల్. ఆ ఇద్దరూ తండ్రి బాటలో నటులుగా మారి అనేక సినిమాల్లో హీరోలుగా నటించారు. ఒక దశాబ్ద కాలం సన్నీ బాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా రాణించాడు కూడా. ఆ ఇద్దరు కాకుండా విజీత, అజీత అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఆ దంపతులకు ఉన్నారు. 1980లో హేమమాలినిని ధర్మేంద్ర రెండో పెళ్లి చేసుకొనే దాకా ప్రకాశ్ కౌర్ మీడియా దృష్టికి దూరంగా, ఒక గృహిణిగా సింపుల్ లైఫ్ గడుపుతూ వచ్చారు. తన భర్త టాప్ స్టార్ అయినప్పటికీ ఆమె లో ప్రొఫైల్‌లోనే ఉన్నారు.
విశేషమేమంటే హేమమాలినితో తన భర్త రెండో పెళ్లిని ఆమె అనుమతించారు. తన భర్తపై హేమమాలిని ప్రేమను ఆమె అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో ధర్మేంద్రను ఆమె వెనకేసుకురావడం గమనార్హం. స్టార్‌డస్ట్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనతో పోల్చుకుంటే ఎవరైనా సరే హేమమాలినినే ఎంచుకుంటారనీ, తన భర్త కూడా అదే చేశాడనీ చెప్పడం ఆమె ఉదార హృదయానికి నిదర్శనం. పెళ్లయిన చాలా మంది హీరోలకు వేరే ఎఫైర్లు ఉన్నాయనీ, వాళ్లలో చాలా మంది రెండో పెళ్లి చేసుకున్నారనీ ఆమె భర్తను వెనకేసుకొచ్చారు.



Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



