ENGLISH | TELUGU  

'ధమాకా' మూవీ రివ్యూ

on Dec 23, 2022

 

సినిమా పేరు: ధమాకా 
తారాగణం: రవితేజ, శ్రీలీల, సచిన్ ఖేడేకర్, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, శ్రీతేజ్, తులసి, రాజశ్రీ నాయర్, పవిత్రా లోకేష్, తులసి, ప్రవీణ్, అలీ, సమీర్
కథ, స్క్రీన్-ప్లే, డైలాగ్: ప్రసన్న కుమార్ బెజవాడ
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: టిజి విశ్వప్రసాద్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
బ్యానర్: పీపుల్ మీడియా
విడుదల తేదీ: 23 డిసెంబర్, 2022 

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో 'ధమాకా' అనే సినిమా వస్తున్నదనేసరికి చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజ కామెడీ టైమింగ్ కి, త్రినాథరావు లాంటి కామెడీపై పట్టున్న డైరెక్టర్ తోడైతే ఇక ఆ మూవీ హిలేరియస్ గా నవ్వులు పంచుతుందని ఎవరైనా అనుకుంటారు కదా! ధమాకా విషయంలో అదే జరిగింది. ఈ మూవీలో రవితేజ డబల్ రోల్ చేశాడని విడుదలకు ముందు వచ్చిన ప్రచారం కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. రవితేజ వయసులో సగం కూడా లేని శ్రీలీల హీరోయిన్ గా చేసిన 'ధమాకా' ఎలా ఉందంటే...

కథ
పదివేల మంది ఉద్యోగులు పనిచేసే పీపుల్ మార్ట్ అనే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయిన చక్రవర్తి (సచిన్ ఖేడేకర్) తాను ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నానని, రెండు నెలల్లో తాను చనిపోతానని బహిరంగంగా ప్రకటిస్తాడు. అది చూసిన జెపి ఆర్బిట్ కంపెనీ యజమాని జెపి (జయరామ్) పీపుల్ మార్ట్ ను ఆక్రమించుకోవాలని అనుకుంటాడు. జేపీని చక్రవర్తి కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ) అడ్డుకుంటాడు. రమేష్ రెడ్డి (రావు రమేష్) కుమార్తె ప్రణవిని పెళ్లాడాలని ఆనంద్ అనుకుంటాడు. అతడితో పాటు అతడిలాగే ఉన్న స్వామి (రవితేజ)ని కూడా ఇష్టపడుతుంది ప్రణవి. ఆ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ కు గురవుతుంది. త్వరలోనే ఆమెకు ఓ క్లారిటీ వస్తుంది. ఇంతకీ స్వామి, ఆనంద్ ఇద్దరూ ఒకలాగే ఎందుకున్నారు? తనను, తన తండ్రిని చంపాలనుకున్న జేపీని ఆనంద్ ఎలా నిలువరించాడు? అనే విషయాలు మిగతా కథలో చూద్దాం.

విశ్లేషణ 
'ధమాకా' అనేది పూర్తిగా రవితేజ క్యారెక్టరైజేషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి చేసిన సినిమా. అందువల్ల కొత్తదనానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ మూవీని తన భుజ స్కంధాలపై మోసుకొని వెళ్ళాడు రవితేజ. విడుదలకు ముందు రవితేజ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదు. సినిమాలో రవితేజ రెండు క్యారెక్టర్లలో కనిపిస్తాడు కానీ నిజానికి అతడు ఒకడే. స్వామి అతడే, వివేకానంద చక్రవర్తి అతడే. చిన్నతనంలో తండ్రి (తనికెళ్ళ భరణి) నుంచి తప్పిపోయే సమయానికి స్వామి మరీ పసిపిల్లాడేమీ కాదు. తనకు కనిపించిన అతడిని తనతో తీసుకుపోయి నాలుగేళ్ల పాటు చక్రవర్తి పెంచుకుంటాడు. వివేకానంద చక్రవర్తి అనే పేరు పెడతాడు. నాలుగేళ్ల తర్వాత కన్నవాళ్ల దగ్గరకు వస్తాడు స్వామి. ఆ నాలుగేళ్లూ స్వామి పెంచిన తల్లితండ్రుల పక్కలోనే పడుకుంటాడన్నట్లు, పెంచిన తల్లి మంచంపై స్వామి లేని లోటు ఫీలైనట్లు, దాంతో వారికి కూడా స్వామి కొడుకేనని కన్నతండ్రి హామీ ఇఛ్చినట్లు చూపించడం లాజిక్ కు ఏమాత్రం అందని విషయాలే కాదు, ఈ కాలానికి హాస్యాస్పదమైన విషయాలు కూడా. అల.. వైకుంఠపురములో మూవీ స్పూర్తితో స్వామి క్యారెక్టర్ ను రచయిత ప్రసన్నకుమార్ అల్లుకున్నట్లు తోస్తుంది. ఆ సినిమాలో మామా అల్లుళ్లుగా కనిపించిన సచిన్, జయరామ్.. ఈ మూవీలో ప్రత్యర్థులుగా కనిపించడం కూడా యాదృఛ్చికం కాదు కదా!

కథ ఎంత మూస ధోరణిలో, పాతచింతకాయ పచ్చడి ధోరణిలో ఉన్నప్పటికీ కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రసన్నకుమార్ రాసిన సంభాషణలు. త్రివిక్రమ్ శైలి వన్ లైనర్స్ చాలానే ఇందులో ఉన్నాయి. అవి మంచి హాస్యాన్ని పంచాయి. రవితేజ, రావు రమేష్ మధ్య పద్యాల ధోరణిలో సాగే సంభాషణల ఎపిసోడ్ ఆహ్లాదాన్ని పంచింది. అలనాటి రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య జోడీ తరహాలో రావు రమేష్, హైపర్ ఆది మధ్య కామెడీ ట్రాక్ తెగ నవ్వించింది. ఆ ఇద్దరు తెరపై కనిపించారంటే మన పెదాలపై నవ్వుల జల్లులు కురియాల్సిందే. వారిమధ్య వయసు తేడా బాగా కనిపిస్తున్నప్పటికీ.. రవితేజ, శ్రీలీలపై తీసిన సరసమైన సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. విలన్ గా జయరామ్ పాత్ర చిత్రణలో కొత్తదనం లేకపోయినా కథలో కొంత టెంపో రావడానికి అది కారణమైంది.

టెక్నీకల్ గా సినిమా రిచ్ గా కనిపించింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ లో కెమెరా పనితనం స్పష్టం. భీమ్స్ సిసిరోలియోకు మ్యూజిక్ డైరెక్టర్ గా ధమాకా మంచి పేరు తెచ్చింది. పాటలకు సమకూర్చిన బాణీలు అలరిస్తే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కథకు తగ్గట్లు ఉంది. స్క్రీన్-ప్లే విషయంలో రైటర్ ఇంకా శ్రద్ధ చూపించినట్లయితే, మరింత ఆకర్షణీయంగా మూవీ వచ్చేది. ఆర్ట్ వర్క్ బాగానే ఉంది.

నటీనటుల పనితీరు
స్వామిగా, వివేకానంద్ చక్రవర్తిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను తనకు అలవాటైన తీరులో చలాకీగా చేసుకుపోయాడు రవితేజ. క్యారెక్టర్ కు తగ్గట్లు చలాకీగా నటించాడు. వయసు మీదపడుతున్నా ఆ ఛాయలు కనిపించలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చురుకుదనం అలాగే ఉంది. ప్రణవిగా హుషారైన పాత్రలో శ్రీలీల సరిపోయింది. గ్లామర్ తో ఆకట్టుకుంది. పాటల్లో రవితేజతో హుషారుగా స్టెప్పులేసింది. రావు రమేష్ తనదైన శైలి నటనతో రమేష్ రెడ్డి పాత్రలో ఇమిడిపోయాడు. అతని కారు డ్రైవర్ గా హైపర్ ఆది పర్ఫెక్టుగా కుదిరాడు. జయరామ్ విలన్ జేపీగా మెప్పించాడు. చక్రవర్తి పాత్రలో సచిన్ ఖేడేకర్ హుందాగా ఉన్నాడు. హీరో కన్న తల్లితండ్రులుగా తనికెళ్ళ భరణి, తులసి సరిగ్గా సరిపోయారు. జయరామ్ కొడుకు అగర్వాల్ గా యంగ్ విలన్ రోల్ లో చిరాగ్ జానీ కనిపించాడు. అలీకి ఈ సినిమాలో ఇచ్చిన పాత్ర చూసి జాలిపడక తప్పదు. దిష్టిబొమ్మ టైపు రోల్ లో ఆయన కనిపించాడు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

తెలుగువన్ పర్స్పెక్టివ్ 
1980ల కాలంలో రాజ్యం చేసిన తరహా కథతో ఏమాత్రం కొత్తదనం లేకుండా వచ్చిన 'ధమాకా' మూవీని రవితేజ నటన, ప్రసన్నకుమార్ సంభాషణలు, కామెడీ సీన్లు రక్షించాలి. అవి తప్పితే చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేని సినిమా ఇది. 

రేటింగ్: 2.5/5

- బుద్ధి యజ్ఞమూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.