ENGLISH | TELUGU  

బిగ్ బాస్ 4 గేమ్స్‌.. నేరాలు, ఘోరాలు!

on Sep 30, 2020

 

వినోదం, మనుషుల మధ్య బాండింగ్, ఎమోషన్స్  ప్రధాన పాత్రగా రూపుదిద్దుకున్న బిగ్ బాస్ హౌస్ లో క్రైమ్ రేట్ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఫిజికల్ టాస్క్ లోనూ, ఎలిమినేషన్ నామినేషన్స్ లోనూ సభ్యుల మధ్య నేరాలను ప్రేరేపించేలా టాస్క్ లు ఉండటం, అవి రెండుమూడు ఎపిసోడ్స్ వరకు సాగదీయడం ప్రేక్షకుల్లో చికాకు తెప్పిస్తోంది. ఎలిమినేషన్స్ లో ఉన్న సభ్యులు ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో బిగ్ బాగ్ హెచ్చరికలను కూడా ఖాతరు చేయడం లేదు. రాత్రంతా జాగరణ చేస్తూ ఇంటిసభ్యులందరి కాయిన్స్ దొంగిలించడంతో మెహబూబ్, సోహైల్ బిజీ దొంగలుగా మారారు. ఫిజికల్ టాస్క్ లో రెండోదశలో కాలుబెణికి ఆసుపత్రికి వెళ్లిన అవినాష్., క్లిలర్ కాయిన్ కు బలైన మోనాల్ బాత్ రూమ్ లో దూరి పెద్దగా ఏడ్వడం మొదలైన అనేక సంగతుల సమాహారంగా బిగ్ బాస్ ఎపిసోడ్ 25 కొనసాగింది.

బిగ్ హౌస్ కెప్టెన్సీ కోసం ఇచ్చిన కాయిన్స్ కలెక్షన్ టాస్క్ 24వ రోజు కూడా కొనసాగింది. బెల్ మోగినప్పుడల్లా గార్డెన్ ఎరియాలో పడిన కాయిన్స్ తీసుకోవడానికి ఉరుగులు, పరుగులు పెట్టిన ఇంటిసభ్యులకు వాటిని దాచుకోవడం పెద్ద సమస్యగా మారింది. దివి, హారికలకు కాయిన్స్ దాచుకోవడంలో అమ్మ రాజశేఖర్ సహాయం చేశారు. తన దగ్గర ఉన్న కాయిన్స్ లో కొన్ని కుమార్ సాయి నుంచి తీసుకున్నవి కావడంతో అతని కాయిన్స్ అతనికి ఇచ్చేశారు. మరోసారి గార్డెన్ ఏరియాలో కాయిన్స్ పడ్డాయి.

ఈ సారి స్విచ్ కాయిన్ పడగా దాన్ని చేతిలోకి తీసుకున్న మెహబూబ్ అదేంటో అర్థం కాక కిందపడేశాడు. వెంటనే దాన్ని సుజాత అందుకుంది. స్విచ్ కాయిన్ ప్రత్యేకమని, ఈ టాస్క్ లో ఆ కాయిన్ ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని  బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దాంతో మెహబూబ్‌పై సోహైల్ కోప్పడ్డాడు. అనౌన్స్ మెంట్ వినేవరకు అయినా నీతో ఉంచుకోవల్సింది అన్నాడు సోహైల్. తనకు దొరికిన కాయిన్ స్పెషల్ కావడంతో దాన్ని దాచుకోవడానికి సుజాత చాలా తిప్పలు పడింది. చివరికి డ్రస్ లోపల దాచుకుని టవల్ లో కవర్ చేసింది. బెంచ్ పై పడుకున్న నోయల్ పక్కనే కూర్చీలో కూర్చోని నిద్రపోయింది.

తన దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ ను బెడ్ కింద బాక్స్ లో పెట్టి అక్కడే పడుకున్నారు అమ్మ రాజశేఖర్. అయితే అర్ధ‌రాత్రి కాయిన్స్ కొట్టేయడానికి వచ్చిన సోహైల్ కు లాస్య, అరియానా సహాయం చేశారు. బెడ్ ను అమాంతం పైకి లేపి కాయిన్స్ కొట్టేసి ముగ్గురు పంచుకున్నారు. ఇంట్లో సేఫ్ కాదని గార్డెన్ ఏరియాలో కుర్చీలు కుప్పగా వేసి వాటి మధ్యలో తమ కాయిన్స్ దాచుకున్నారు మెహబూబ్, సోహైల్. వాటిపై బ్లాంకెట్స్ వేయడంతో వాటిని తీయాలని తర్వాత బిగ్ బాస్ ఆదేశించినా లెక్కచేయలేదు.

సొహైల్‌ను తిట్టిన సుజాత‌
అమ్మ రాజశేఖర్ వద్ద కాయిన్స్ కొట్టేసిన తర్వాత ఆనందంతో తీన్మార్‌ డాన్స్ చేశాడు సోహైల్. ఆ తర్వాత  కుమార్ సాయి వద్ద దొంగతనం చేసే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. అయితే అవినాష్ వద్ద కొన్ని కాయిన్స్ కొట్టేశాడు. అరియానా బిన్ బ్యాగ్ లో దాచుకున్న కాయిన్స్, నిద్రపోతున్న నోయల్ వద్ద మరి కొన్ని కాయిన్స్ మెహబూబ్ కొట్టేశాడు. సోహైల్ కూడా నోయల్ వద్ద కాయిన్స్ తీయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో సుజాతకు మెలుకువ వచ్చి సోహైల్ ను చెడామడా తిట్టేసింది.  సోహైల్, మెహబూబ్ తాము దొంగతనం చేసిన  కాయిన్స్ ను పంచుకుంటూ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అర్థమ‌వుతోంది.

మ‌న‌స్సాక్షి ఉండాలి!
"ఇట్టాగే రెచ్చిపోనా" అంటూ సాగిన వేకప్ సాంగ్ లోనూ ఫుల్ జోష్ సోహైల్, మోహబూబ్ స్టెప్పులేశారు. నిద్రలేచిన అమ్మ రాజశేఖర్ కాయిన్స్ మాయం అవడం గమనించి సొహైల్, మెహబూబ్ ల పనే అని డిసైడ్ అయి వారి వద్దకు వచ్చాడు. "ఇది గేమ్  మాస్టర్ తర్వాత మాట్లాడదాం" అని సోహైల్ అన్నాడు. "గెలుద్దామనే తీశారా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "మనస్సాక్షి ఉండాలి. ఆడండి.. గెలవండి.. కప్పు తీసుకోండి" అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

అభిని నిలదీసిన హారిక
ఇంటిసభ్యుల మధ్య ఏర్పడిన బాండిగ్స్ ఈ టాస్క్ లో కనిపించాయి. తన కాయిన్స్ ను నచ్చిన వారికి ఇవ్వడానికి కొందరు సిద్ధమయ్యారు. అలాగే అభిజిత్ కూడా తన కాయిన్స్ లో కొన్ని స్వాతికి ఇచ్చాడు. "హౌస్ లోకి కొత్తగా వచ్చిన  స్వాతికి ఎందుకు కాయిన్స్ ఇస్తున్నావు?" అంటూ హారిక అభిజిత్ ను నిలదీసింది. "ఆమె హౌస్ లో ఏ బాధ్యత తీసుకోవడం లేదు. ఆట ముందే చూసి ఎవరితో ఎలా ఉండాలో ప్లాన్ తో వచ్చింది. నువ్వు ఎందుకు నీ కాయిన్స్ ఆమెకు ఇస్తున్నావు?" అని ప్రశ్నించింది. "మూడు వారాల నుంచి కలిసి ఉంటున్నాం. నేను కూడా నామినేషన్ లో ఉన్నా. ఫ్రెండ్ గా నాకు సహాయం చేయి. అంతేకాని రెండురోజుల కిందట వచ్చిన స్వాతికి కాదు" అంది హారిక.  దాంతో "అలాంటిది ఏమీ లేదు. నేను కాయిన్స్ ఏమి ఇవ్వలేదు. ఎవరి టాస్క్ వారిదే" అంటూ అభి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని కూల్ చేసే ప్రయత్నం చేశాడు.

గంగవ్వ జీరో.. మెహబూబ్ హీరో
కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ ఫిజికల్ టాస్క్ కు  గంగవ్వ దూరంగా ఉంది. ఆమె ఇప్పటికే కెప్టెన్ హోదాలో ఉన్నారు. దాంతో మరోసారి కెప్టెన్ కోసం పరుగులు తీయలేక ఇంటిసభ్యుల ఆట గమనిస్తోంది. ఫిజికల్ టాస్క్ లో ఫస్ట్ లెవల్ కాయిన్స్ కలెక్షన్ పూర్తి అయ్యిందని, మరి కొన్ని లెవల్స్ ఉన్నాయని బిగి బాస్ చెప్పారు. ఎవరి వద్ద ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కచెప్పమని సూచించాడు. దాంతో ఇంటిసభ్యులు తమతో ఉన్న కాయిన్స్ లెక్క చెప్పారు. అవినాష్ - 3160, అమ్మ రాజశేఖర్ - 320, స్వాతి - 1930, లాస్య - 1560, అభిజిత్ - 1770, నోయల్ - 900, హారిక - 1450, సొహైల్ - 3620, మెహబూబ్ - 4360, మోనాల్ - 610, అఖిల్ - 2570, అరియానా - 1850, దివి - 110, కుమార్ - 1570 కాయిన్స్ లెక్క చెప్పారు.  సుజాత 340 కాయిన్స్ తో పాటు స్విచ్ కాయిన్ తనతో ఉందని చెప్పింది. గంగవ్వ ఈ టాస్క్ కు దూరంగా ఉంది.

కిల్లర్ కాయిన్ తో..
ఇంటిసభ్యులంతా రెండో దశకు చేరుకున్నారు. ఈ దశలోమొత్తం ఎనిమిది రౌండ్స్ ఉంటాయి.  ముందుగా ఇంటిసభ్యులందరూ స్టోర్ రూంలో ఉన్న స్పెషల్ జాకెట్స్ ధరించాలి. గార్టెన్ ఏరియాలో ఉన్న కిల్లర్ కాయిన్ ను  బజర్ మోగే సమయానికి ఎవరి జాకెట్ పై  ఉంటే వారి పాయింట్స్ లో సగం తగ్గిపోతాయి. ముందుగా తక్కువ పాయింట్స్ వచ్చిన వారు కిల్లర్ కాయిన్ తీసుకోవాలని, బిగ్‌ బాస్ పంపించిన వివరాలను లాస్య చదివి వినిపించింది. బజర్ మోగగానే దివి కిల్లర్ కాయిన్ తీసుకుని సోహైల్  వెంటపడింది. మెహబూబ్, అఖిల్ లివింగ్ రూంలోనే ఉండిపోయారు. వారిద్దరినీ కూడా బయటకు రావాలని ఇంటిసభ్యులు కోరారు. ఇంటిసభ్యులందరి వద్ద కాయిన్స్ కొట్టేసిన సోహైల్ ను చాలామంది టార్గెట్ చేశారు. దాంతో ఉక్రోషానికి వచ్చిన సోహైల్ ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక‌రినే టార్గెట్ చేస్తే క‌థ వేరే ఉంట‌ద‌ని సోహైల్ హెచ్చ‌రించడంతో అమ్మ రాజశేఖర్ ఏం వేరేగా ఉంటది అంటూ ముందుకు వచ్చాడు. దాంతో సోహైల్, అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ జరిగింది. మెహబూబ్, అఖిల్ గార్డెన్ లోకి వచ్చి వారిద్దరినీ సమాధానపరిచారు. బజర్ మోగేసరికి కిల్లర్ కాయిన్ చివరికి మోనాల్ జాకెట్ పై ఉంది. దాంతో మోనాల్ పాయింట్స్ తగ్గిపోయాయి. ఇంతలో కాలు స్లిప్ అయి అవినాష్ కింద పడ్డాడు. అతనిని మెహబూబ్, నోయల్, అఖిల్, సోహైల్ ఎత్తుకుని బిగ్ హౌస్ లోని హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు.

బాత్ రూమ్ లో వెక్కివెక్కి ఏడ్చిన మోనాల్
బిగ్ హౌస్ లో డే వన్ నుంచి కన్నీటి ప్రవాహంతో చివరికి నాగార్జున చేత నర్మదా నదిగా పిలిపించుకున్న మోనాల్ బాత్ రూమ్ లో దూరి బిగ్గరగా ఏడ్చేసింది. కాయిన్స్ కొట్టేసి తనను అనుమానించడం ఆమె తట్టుకోలేకపోయింది. తన బాధనంతా అద్దం ముందు కూర్చోని ఇంగ్లీష్‌, హిందీలో వెల్లబోసుకుంది. ఇంతలో మోనాల్ ను తెలుగులో మాట్లాడాలని బిగ్‌ బాస్ ఆదేశించాడు. తన నుంచి సాధ్యం కాదని, మనసులోని బాధ తెలుగులో చెప్పలేక బాత్ రూమ్ లో దూరి బిగ్గరగా ఏడ్చేసింది.

ఎనిమిది రౌండ్ల రెండో దశ క్లిలర్ కాయిన్ టాస్క్ లో ఎవరెవ్వరి పాయింట్స్ సగమవుతాయో.. స్పెషల్ కాయిన్ తో సుజాత ఎవరి పాయింట్స్ ను తీసుకుంటుందో నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాల్సిందే...


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.