ఓటీటీలో హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కథలో ట్విస్టులు, భయపెట్టే సన్నివేశాలతో ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి జోనర్‌లో తమిళంలో తెరకెక్కిన సినిమా ‘డార్క్’. అజయ్ కార్తీ, అంచనా నేత్రున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కల్యాణ్ కె. జగన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. విఘ్నేశ్ ఉద్యోగం కోసం చెన్నైకి వస్తాడు. తక్కువ అద్దెకు ఇల్లు కావడంతో ఓ ఇంటి పై పోర్షన్‌లో ఉండేందుకు ఒప్పుకుంటాడు. అయితే ఆ ఇంటి గురించి యజమాని కరుణాకర్ చెప్పే విషయం అతడిని ఆలోచనలో పడేస్తుంది. గతంలో అదే పోర్షన్‌లో ముగ్గురు యువకులు ఉండేవారు. వారిలో జీవా అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని కరుణాకర్ చెబుతాడు.
ఆ తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన కొందరు కూడా దెయ్యాల భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. అయినప్పటికీ తక్కువ అద్దె కావడంతో విఘ్నేశ్ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇక రాత్రి సమయాల్లో ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. ఎవరూ ఆన్ చేయకుండానే టీవీ ఆన్ కావడం, వస్తువులు వాటంతట అవే కదలడం వంటి ఘటనలు అతడిని భయపెడతాయి. అసలు ఆ ముగ్గురు యువకులు ఎందుకు చనిపోయారు? ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? లేక విఘ్నేశ్ అనుభవిస్తున్నదంతా అతడి మానసిక భ్రమేనా? అనేదే కథలో ఆసక్తికరమైన అంశం.
దర్శకుడు దెయ్యాన్ని నేరుగా చూపించకుండా హీరో భయాన్ని ప్రేక్షకులకు కూడా అనుభూతి కలిగించేలా కథను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం ఇబ్బంది పెడుతుంది. ముగ్గురు యువకుల మరణం వెనుక అసలు కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకుడు ముందుకు వెళతాడు. కానీ కొంతవరకు ఊహించగలిగే విధంగా ఫ్లాష్‌బ్యాక్ రావడంతో అప్పటివరకు ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది.
అలాగే సినిమాలో దెయ్యాలున్నాయా? లేక ఇదంతా సైకలాజికల్ ఎఫెక్టా? అనే అయోమయాన్ని క్రియేట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదనే అభిప్రాయం కలుగుతుంది. సాధారణంగా హారర్ సినిమాలకు బలం చేకూర్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.
నటీనటుల్లో హీరో పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువ భాగం కథ నాలుగు గోడల మధ్యే సాగుతుంది. భయపడుతున్న హీరోను చూపించడం ద్వారా ప్రేక్షకులను భయపెట్టాలని దర్శకుడు ప్రయత్నించినా, ఆ ఎఫెక్ట్ పూర్తిగా రాలేదు. చివర్లో దెయ్యం కనిపించినా పెద్దగా భయపెట్టే స్థాయిలో లేకపోవడం మైనస్‌గా మారింది.
[Dark Movie Review, Dark Telugu Movie Review, Dark OTT Movie Review, Dark Amazon Prime Movie, Dark Movie Review Telugu, Ajay Karthi Dark Movie, Anchana Nethrun, Kalyan K Jegan, Tamil Horror Thriller, Amazon Prime Telugu Movies]





