'ఎఫ్‌సీయూకే' పాటలను విడుదల చేయనున్న కొవిడ్ హీరోలు
on Jan 23, 2021

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న 'ఎఫ్‌సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, ఈ సినిమా పాటలను విభిన్న తరహాలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. సాధారణంగా సినిమా పాటలను సినిమా స్టార్లతో రిలీజ్ చేస్తుంటారు. కానీ 'ఎఫ్‌సీయూకే' పాటలను కొవిడ్ హీరోలు రిలీజ్ చేయనున్నారు. అవును. ఈ విషయాన్ని జగపతిబాబు ఎనౌన్స్ చేశారు. అందరినీ క్షేమంగా ఉంచడానికి తమ జీవితాల్ని పణంగా పెట్టి, కొవిడ్‌పై అలుపెరుగకుండా పోరాడుతూ వస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సెల్యూట్ చేయాలనే సదుద్దేశంతో పాటల విడుదలకు వారిని ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.
సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సందేశంలో ఆయన, దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న కాలంలో, అందరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్న సమయంలో ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తూ వచ్చిన మెడికల్, పోలీసు, మునిసిపల్, మీడియా సిబ్బంది కృషిని కొనియాడారు. వారి అసామాన్య సేవలకు గుర్తింపుగా ఒక్కో విభాగానికి చెందిన రియల్ హీరో చేతుల మీదుగా 'ఎఫ్‌సీయూకే' చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేయిస్తున్నట్లు జగపతిబాబు చెప్పారు.
ఇదివరకు ఈ వారం మొదట్లో జరిగిన 'ఎఫ్‌సీయూకే' టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను పనిచేసిన అత్యంత విలక్షణ చిత్రాల్లో ఈ సినిమా ఒకటని తెలిపారు. ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ మూవీ అనీ, ఇందులో తాను చేసిన ఫాదర్ క్యారెక్టర్ చాలా తృప్తినిచ్చిందనీ చెప్పారు. పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆయనన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



