కల్వకుంట్ల కవిత సమర్పణలో 'లైగర్'.. తెర వెనుక కథ నిజమేనా?
on Sep 6, 2022

మూలిగే నక్క తాటికాయ పడ్డట్టుగా.. భారీ అంచనాలతో విడుదలై బొక్క బోర్లా పడ్డ 'లైగర్' మూవీ రోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకి పొలిటికల్ రంగు అంటుకుంది. ఈ సినిమాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెరుపు తీగలా వేగంగా సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఎప్పుడూ లేనంతగా 'లైగర్' కోసం ఎక్కువ టైం తీసుకున్నాడు. బడ్జెట్ కూడా భారీగా పెట్టారు. కమెడియన్ కి ఎక్కువ, విలన్ కి తక్కువ అన్నట్టుండే రోల్ కోసం కోట్ల రూపాయలు సమర్పించుకొని ఏకంగా లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ని రంగంలోకి దింపారు. ఇక విడుదలకు ముందు హీరో విజయ్ అయితే '10 కోట్లు, 20 కోట్లు కాదు షేర్ ఖాన్.. మా సినిమా కలెక్షన్స్ 200 కోట్ల నుంచి లెక్కపెట్టుకోవాలి' అంటూ భారీ డైలాగ్ కొట్టాడు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే అందులో పావు వంతు కలెక్ట్ చేసినా గొప్పేనన్న విషయం అందరికీ అర్థమైంది. అయితే ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే.. అసలు ఈ స్క్రిప్ట్ ని నమ్ముకొని అన్నన్ని కోట్ల డబ్బులు మంచి నీళ్లలా ఎలా ఖర్చు పెట్టారనేది అంతుచిక్కని ప్రశ్న. అయితే తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ అసలు ఈ సినిమాకు నిర్మాత కల్వకుంట్ల కవిత అంటూ బాంబు పేల్చాడు. ఈ సినిమాలో కవిత బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశాడు. విజయ్ కి కేసీఆర్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. 'అర్జున్ రెడ్డి' టైంలో విజయ్ ని మినిస్టర్ కేటీఆర్ ఆకాశానికెత్తడమే కాకుండా ఇంటికెళ్ళి మరీ కలిశారు. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఆరోపణల నేపథ్యంలో అందరూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు.

కాంగ్రెస్ నేత చెప్పినట్లు లైగర్ సినిమాలో కవిత నిజంగానే పెట్టుబడులు పెట్టినట్లయితే.. మరి ఛార్మి కన్నీరు బూడిదలో పోసిన పన్నీరేనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ టైంలో ఛార్మి మాట్లాడుతూ ఈ సినిమాకి చాలా ఖర్చు పెట్టామని, చేతిలో రూపాయి లేని టైములో భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినా ఓకే చెప్పలేదని చెప్పింది. ఇక రిలీజ్ తర్వాత ఫ్లాప్ టాక్ రావడంతో.. ఒక్క ఫ్లాప్ తో ఇన్నేళ్ళు సంపాదించిందంతా పోయిందంటూ ఎమోషనల్ అయింది. మరి కాంగ్రెస్ నేత ఆరోపిస్తున్నట్లు లైగర్ లో కవిత పెట్టుబడి పెడితే.. ఛార్మి ఎందుకు కన్నీరు పెట్టినట్లు?. తెరపై నటించడం మానేసిన ఛార్మి తెర వెనుక నటించడం మొదలు పెట్టిందా? లేక కల్వకుంట్ల కవిత సమర్పణలో 'లైగర్' అనే ఆరోపణలు అబద్దమా?. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఆ పూరి జగన్నాథుడికే తెలియాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



