'ఆచార్య'కు 'శానా కష్టం'.. ఏపీ, తెలంగాణ మంత్రుల వద్దకు చేరిన వివాదం!
on Jan 8, 2022
.webp)
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఆచార్య' సినిమా నుంచి ఇటీవల 'శానా కష్టం' అనే సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పేరుకి తగ్గట్లే ఈ సాంగ్ ఆచార్యకు కష్టాలు తీసుకొస్తోంది. ఈ సాంగ్‌లో లిరిక్స్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఇప్పుడు ఈ వివాదం ఏకంగా తెలుగు రాష్ట్రాలలోని మంత్రుల వద్దకు చేరడం సంచలనంగా మారింది.
'శానా కష్టం' సాంగ్ కి లిరిక్స్ అందించిన భాస్కరభట్ల ఒక లైన్ లో 'ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు' అని రాయడం వివాదానికి తెరదీసింది. ఈ లిరిక్స్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉన్నాయని, ఆ పాటని తొలగించాలని కోరుతూ ఆ సంఘం నాయకులు ఇటీవల జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమాఖ్య అధ్యక్షుడు పంగ మల్లేశం ఫిర్యాదు చేశారు. RMP డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న లైన్స్ ని ఆ సాంగ్ నుంచి తొలగించాలని ఆయన కోరారు.
'శానా కష్టం' సాంగ్ వివాదం తాజాగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత వద్దకు చేరింది. 'శానా కష్టం' పాటలోని సాహిత్యం తమను అవమానపరిచే విధంగా ఉందంటూ.. ఏపీ ఆర్.ఎం.పి సంక్షేమ సంఘం నాయకులు హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ పాటలో RMP లను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలు తొలగించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గణపతి రావు కోరారు. ఒక సినిమా పాట వివాదం తెలుగు రాష్ట్రాల మంత్రుల వద్దకు చేరడం సంచలనంగా మారింది. మరి ఈ వివాదంపై మూవీ టీమ్ స్పందించి సాంగ్ నుంచి ఆ లైన్ తొలగిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



