
నందమూరి-మంచు కుటుంబాల బంధం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు కుటుంబాల అనుబంధం ప్రత్యేకమైనది. ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా మా అన్నగారు అంటూ అప్యాయంగా సంబోధిస్తుంటారు మోహన్‌బాబు. నటరత్నతోనూ తర్వాత వారి వారసులతోనూ అదే బంధాన్ని మెయిన్‌టైన్ చేస్తూ వచ్చారు డైలాగ్ కింగ్. ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ, మోహన్‌బాబు ఎప్పుడు ఎక్కడ కలిసినా అప్యాయంగా పలకరించుకుంటారు. తాజాగా నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు మోహన్‌బాబు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లోని ఫేమస్ డైలాగ్‌లతో "డైలాగ్ కింగ్" అనే బుక్ రిలీజ్ చేశారు. "ఒక వ్యక్తిగా..నటుడిగా నాకు మా నాన్నగారు స్పూర్తి. ఆయన తర్వాత నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబు గారే. క్రమశిక్షణతో, ధృఢ సంకల్పంతో తాను అనుకున్న దారిలో ముందుకుసాగి స్వతహాగా గుర్తింపు పొందిన నటుడు" అంటూ బాలయ్య రాసిన వ్యాఖ్యలివి. ఈ విధంగా కలెక్షన్ కింగ్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు బాలకృష్ణ.







