మన అనుబంధం మరింత బలపడాలి బ్రదర్ .. నాగబాబుకు చిరు ఆశీస్సులు!
on Oct 29, 2020
స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. 1980ల తొలినాళ్ల వరకు ఆయన ఒక చిన్న నటుడు మాత్రమే. 1983లో 'ఖైదీ' వచ్చిన తర్వాత స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఆయన అచిర కాలంలోనే టాలీవుడ్లో నంబర్‌వన్ స్టార్‌గా మారారు. అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ మెగా కాంపౌండ్ అని ఫిల్మ్‌నగర్ జనాలు కానీ, మీడియా కానీ, ప్రేక్షకులు కానీ పిలుచుకొనే స్థాయికి ఆయన కుటుంబం ఎదిగింది. ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా ఆయన వారసత్వాన్ని అందుకొని నటులయ్యారు. పవన్ కల్యాణ్ అయితే అన్నకు తగ్గ తమ్ముడిగా అమేయమైన ఇమేజ్ను అభిమానుల్లో సంపాదించుకున్నారు. మొత్తానికి ఆ ముగ్గురు మెగా బ్రదర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.
నాగబాబు నటునిగా స్టార్ కాలేకపోయినా, ఇప్పుడు ఆయన తనయుడు వరుణ్‌తేజ్ ఆ లోటును పూడ్చే దిశగా దూసుకుపోతున్నాడు. 'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేష్' సినిమాలతో తనలోని విలక్షణత్వాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలూ పొందాడు. నాగబాబు నిర్మాతగా ఎదురుదెబ్బలు తిన్నారు. 'ఆరెంజ్' సినిమాతో ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పుడు అన్నదమ్ములే ఆయనకు అండగా నిలిచారు. చిరంజీవికి తమ్ముళ్లంటే ఎక్కడలేని ఆపేక్ష. పవన్ కల్యాణ్‌ది మొదట్నుంచీ స్వతంత్ర మనస్తత్వం కావడం వల్ల, సైద్ధాంతికంగా చిరంజీవితో ఆయనకు విభేదిస్తుంటాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.
కానీ నాగబాబు అలా కాదు.. అన్నయ్య మాటలకు అత్యంత విలువనిస్తుంటారు. చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే తామసలు ఈ స్థాయిలో ఉండేవాళ్లమే కాదనీ, ఇవాళ ఇండస్ట్రీలో పేరుపొందిన కుటుంబంగా ఉన్నామంటే అది అన్నయ్య చలవేనని వినమ్రంగా చెబుతుంటారు నాగబాబు. పెద్ద తమ్ముడంటే చిరుకూ అమితమైన ప్రేమ. తమ్ముని కుమార్తె నిహారికకు పెళ్లి సంబంధం కుదిర్చింది కూడా ఆయనే. గురువారం నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ప్రేమను సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వ్యక్తం చేశారు చిరంజీవి.
ఇద్దరు తమ్ముళ్లతో తను ఉన్న పిక్చర్‌ను షేర్ చేసిన ఆయన, "Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl. Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!" అంటూ రాసుకొచ్చారు. నిజమే.. వారి బంధం రోజులు గడిచేకొద్దీ పెరుగుతూ వస్తోందే కానీ రవ్వంత కూడా తరగడం లేదు.