'సైరా'ను చూడమంటూ మెగాస్టార్ వాళ్లనే ఎందుకు కలుస్తున్నారు?
on Oct 24, 2019

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా రాంచరణ్ నిర్మించిన ఈ సినిమా తెలుగునాట 'నాన్-బాహుబలి' రికార్డులు సృష్టించింది. హిందీ సహా మిగతా భాషల వెర్షన్లు సరిగా ఆడకపోయినా, తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి అద్వితీయ నటన ప్రదర్శించారంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అలాగే ఒక తండ్రి కలను కొడుకు నెరవేర్చాడంటూ రాంచరణ్‌ను అందరూ ఆకాశానికి ఎత్తేశారు.
అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత 'సైరా'ను చూడాల్సిందిగా కొంతమంది పేరుపొందిన నాయకులను చిరంజీవి కలిసి అడగడంలో రాజకీయ కోణముందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ మేరకు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందని కూడా వారు చెబుతున్నారు. మొదట తెలంగాణ గవర్నర్ తమిళసైను కలిసి 'సైరా'ను చూడాల్సిందిగా అభ్యర్థించారు చిరంజీవి. ఆమె అంగీకారం తెలిపి 'సైరా'ను తన కుటుంబ సభ్యులతో సహా కలిసి వీక్షించారు. 20 ఏళ్ల కాలంలో తాను రెండు సినిమాలే చూశాననీ, గతేడాది రజనీకాంత్ సినిమా 'కాలా' చూసిన తాను, ఇప్పుడు 'సైరా' చూశానని తెలిపారు తమిళసై. 'సైరా' సినిమా చాలా బాగుందనీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి గొప్పగా నటించారంటూ ప్రశంసించారు.
ఆ తర్వాత సతీమణి సురేఖతో అమరావతి వెళ్లి మరీ ఏపీ చీఫ్ మినిస్టర్ వై.ఎస్. జగన్మోహనరెడ్డిని కలిశారు చిరంజీవి. 'సైరా' సినిమాను వీక్షించాల్సిందిగా కోరారు. 'సైరా' మేకింగ్ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. రెండు మూడు రోజుల్లో వీలు చూసుకొని సినిమా చూస్తానని జగన్ మాటిచ్చారు. తాడేపల్లిలోని తన నివాసంలో మెగాస్టార్ దంపతులతో కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు జగన్. అంతేకాదు.. చిరంజీవికి ఆయన బొబ్బిలి వీణను కూడా కానుకగా ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ జగన్ 'సైరా' మూవీని తిలకించడం సాధ్యపడలేదు. బిజీ షెడ్యూల్ కారణంగానే సినిమాని చూసేందుకు జగన్‌కు సమయం లభించలేదని సమాచారం.
ఆపైన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిస్టర్ అమిత్ షా అపాయింట్‌మెంట్ల కోసం చిరంజీవి ప్రయత్నించారు. దీనికోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు కూడా. పనిలో పనిగా చిరంజీవి అభ్యర్థన మేరకు తన నివాసంలో 'సైరా' మూవీని కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లయితే, చిరంజీవి మూడో కన్ను అంటూ ఆకాశానికెత్తేశారు వెంకయ్యనాయుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా అద్భుతంగా నటించారంటూ ప్రశంసించారు.
'సైరా'ను చూడమని చిరంజీవి అభ్యర్థిస్తున్న వాళ్లు కానీ, ఆయన అపాయింట్‌మెంట్లు కోరుతున్న వాళ్లు కానీ బీజీపీకి చెందిన పేరుపొందిన నాయకులో, లేదా మోదీ, అమిత్ షాలతో సత్సంబంధాలు ఉన్నవాళ్లో కావడం గమనార్హమంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏపీ సీఎం జగన్‌నూ, తెలంగాణ గవర్నర్ తమిళసైనీ కలిసిన చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్‌కు కాంగ్రెస్ కంటే బీజేపీనే బలమైన ప్రత్యర్థిగా వ్యవహరిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. రెండూ శత్రు వర్గాల మాదిరిగా వ్యవహరిస్తున్నాయి.
తెలంగాణలో ఎలాగైనా పాగా వెయ్యాలని ప్రధాని మోదీ, హోం మినిస్టర్ అమిత్ షా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 'సైరా'ను చూడాల్సిందిగా కేసీఆర్‌ను చిరంజీవి ఎందుకు అడగలేదంటూ రాజకీయంగా చర్చలు నడుస్తున్నాయి. అంతే కాదు.. కేంద్రంలో యూపీఏ గవర్నమెంటు ఉన్నప్పుడు కేంద్ర టూరిజం శాఖ సహాయమంత్రిగా పనిచేసిన చిరంజీవి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అందుకే బీజేపీ అగ్ర నాయకుల్ని కలవడానికి ఆరాటపడుతున్న ఆయన సోనియా, రాహుల్ గాంధీలను కలవడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదనీ వినిపిస్తోంది.
చిరంజీవి కదలికలు, ఆయన కలుస్తున్న రాజకీయ నాయకులను గమనిస్తుంటే, బీజేపీలో చేరడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారా?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రాజ్యసభ సీటును ఆశిస్తున్నారనీ, అందుకే మోదీ, షాలను కలవడానికి ప్రయత్నిస్తున్నారనీ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని మెగాస్టార్ సన్నిహిత వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన రాజ్యసభ సీటును ఆశించడం లేదని అవి చెబుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు 'సైరా'ను చూపించి, ఆ సినిమాకు మరింత ప్రచారం తీసుకు రావడానికే ఆయన వాళ్లను కలుస్తున్నరనీ, ఇందులో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశం లేదనీ ఆ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ మోదీ, షాల అపాయింట్‌మెంట్ చిరంజీవికి లభిస్తుందా? అసలు చిరంజీవి మనసులో ఏముంది? ఈ ప్రశ్నలకు త్వరలోనే మనకు సమాధనం లభించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



