'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ' సాంగ్‌కు సాయిపల్లవితో చిరు సింగిల్ స్టెప్!
on Sep 19, 2021
మెగాస్టార్ చిరంజీవి 'లవ్ స్టోరి' ప్రి రిలీజ్ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆమిర్ ఖాన్‌తో పాటు చీఫ్ గెస్ట్‌గా వచ్చి అలరించారు. ఒక సందర్భంలో తన సినిమా 'ఖైదీ నంబర్ 150'లోని "అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ" సాంగ్‌కు సాయిపల్లవితో కలిసి ఒకే ఒక్క స్టెప్ వేసి అందర్నీ ఆనందింపజేశారు. చిరంజీవి, ఆమిర్ స్టేజ్ మీద ఉన్నప్పుడు యాంకర్ సుమ "చిరంజీవిగారూ సాయిపల్లవి ఒక్క స్టెప్ వేస్తుందంట" అని చెప్పి, సాయిని స్టేజి మీదకు పిలిచింది. సరే రమ్మనమని చెప్పారు చిరు.
స్టేజ్ మీదకు వచ్చిన సాయి, "సార్ మీరు కూడా చేస్తారా?" అని చిరును అడిగింది. దాంతో ఆయన ఠక్కున స్టేజి దిగబోయారు. "సార్.. సార్.. మీరుండండి సార్. మీరు చేయొద్దు. మీ సూపర్విజన్లో డాన్స్ జరుగుతుంది" అని చెప్పింది సుమ. చిరు వెనక్కి వచ్చారు. ఆయనను తనతో పాటు డాన్స్ వెయ్యమని సాయి అడగగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో "సారంగ దరియా" పాట పల్లవికి ఒక్కతే డాన్స్ చేసి, చిరు దగ్గరకు వచ్చింది సాయి. ఆయన సాయిని కౌగలించుకున్నారు. చిరుని సాయి వదలదలచుకోలేదు.
"సార్ పాట పెట్టండి. నేను సార్‌తో కలిసి డాన్స్ చేస్తాను" అని చెప్పింది. సుమ పాట ప్లే చెయ్యమని అడిగింది. సాంగ్ ప్లే చేసేలోగా చిరు-సాయి ఇద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు. 'ఖైదీ నంబర్ 150'లోని "అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ" సాంగ్ ప్లే చేశాక సాయి డాన్స్ చేద్దామంటే మొదట వద్దని వారించిన చిరు, ఎట్టకేలకు ఆ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేసి, ఇక చాలు అన్నట్లు ఆప్యాయంగా సాయి గడ్డం పట్టుకొన్నారు. అలా చిరు-సాయిపల్లవి డాన్స్ ఎపిసోడ్ లవ్ స్టోరి ఈవెంట్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది.
Also Read