హైకోర్టుకి చిరంజీవి.. అధికారులకు చుక్కలు..!
on Jul 16, 2025
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC)కి అక్షింతలు వేసింది. ఇంతకీ చిరంజీవి ఎందుకు హైకోర్టుకెక్కారు.. హైకోర్టు జీహెచ్ఎంసీకి ఎందుకు అక్షింతలు వేసింది అన్న వివరాలలోకి వెళ్తే.. చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రెన్నోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు. ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 5న చిరంజీవి జీహెచ్ఎంసీకి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకుంటే.. దానినై జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో చిరంజీవి జిహెచ్ఎంసి తీరుపై కోర్టుకెక్కారు.
చిరు తరఫున వాదించిన న్యాయవాది.. చిరంజీవి ఇంటికి సంబంధించి 2002లోనే జి+2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామనీ, ఇప్పుడు పునరుద్ధరణ పనులు మాత్రమే చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలంచి క్రమబద్ధికరించాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చిరంజీవి దరఖాస్తు అందిందనీ, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ దరఖాస్తు పైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని జిహెచ్ఎంసి ని ఆదేశిస్తూ విచారణను ముగించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్న కోర్టు.. సక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
