మొక్కలు నాటిన మెగాస్టార్, పవర్ స్టార్!
on Jul 26, 2020
.jpg)
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా వారు ప్రారంభించారు. వారితో పాటు దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు దూసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు. కరోనా వైరస్ వల్ల మానవ శరీరంలో మొదటగా దెబ్బ తినేది ఊపిరితిత్తులు. గాలి పీల్చుకోలేక మనుషులు చనిపోతున్నారు. ఈ కరోనా సమయంలో సామాన్యులకు కూడా ప్రాణవాయువు విషయం తెలియ వచ్చింది. ఈ భూమి తల్లికి గూడా అడవులు, వృక్షాలు ప్రాణవాయువు అందిస్తాయి. భూమికి ఊపిరితిత్తులు చెట్లు. మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు అందించే గొప్ప సంపద. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మెగా అభిమానులందరూ కూడా మొక్కలు నాటాలి. అదే మనం ఈ భూమికి తిరిగి ఇచ్చే ప్రత్యుపకారం" అని తెలిపారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి సహకారంతో ఆకుపచ్చగా ఉండాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన వారికి కృతజ్ఞతలు. పచ్చదనం లేకపోతే చాలా కష్టం. దుబాయ్ లాంటి దేశంలో పచ్చదనం కోసం చాలా కష్టపడతారు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో గడ్డి మొక్కలను కూడా చాలా అపురూపంగా పెంచుకుంటారు. నేను కూడా ప్రకృతి ప్రేమికుడిని. పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉన్నవాడిని. పచ్చదనాన్ని పెంచాలని స్పృహ ఉన్నవాడిని. మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు ఈ మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని, నా అభిమానులు అందరూ కూడా మొక్కలు నాటి పెంచాలని కోరుతున్నాను" అని పిలుపునిచ్చారు.
.jpg)






Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



