నవ్వులు పంచే బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆ షోలో ఏం జరిగింది?
on Oct 16, 2025
తెలుగు వారు హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ భాషలోనూ లేనంత మంది కమెడియన్స్ టాలీవుడ్‌లో ఉన్నారు. పాతతరం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే ప్రతి కమెడియన్‌ది డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మేనరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. తమదైన శైలిలో ఎంతో మంది హాస్యనటులు తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 1987 ప్రాంతంలో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించిన బ్రహ్మానందం.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు.. థియేటర్ అంతా నవ్వులే నవ్వులు. 1000కి పైగా సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం.. సినిమాల్లోనే కాదు, బయట కూడా నలుగుర్నీ నవ్వించడానికే ప్రయత్నిస్తారు. ఏదైనా ఈవెంట్‌కి వచ్చినా అందర్నీ ఎంటర్‌టైన్ చేసే విధంగానే ఆయన స్పీచ్ ఉంటుంది తప్ప ఎమోషనల్ అయిన సందర్భాలు లేవు. కానీ, ఇటీవల ఒక షోలో ఎమోషనల్ అవ్వడమే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం ఎందుకు ఎమోషనల్ అయ్యారు? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే..
ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 షోకి గెస్ట్‌గా హాజరయ్యారు బ్రహ్మానందం. ఎప్పటిలాగే తనదైన శైలిలో అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. బ్రహ్మానందం లాంటి లెజెండ్ కమెడియన్ ఆ షోకి రావడం వారికి కూడా గర్వ కారణమే కాబట్టి ఆయనకు సంబంధించిన ఒక ప్రోమోను ప్రదర్శించారు. ఆ ప్రోమో చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న శ్రీరామచంద్ర.. ‘ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది?’ అని అడిగాడు. బాలుతో, ఆయన కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఎంతో మంచి వ్యక్తి అని చెబుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం అలా కన్నీళ్లు పెట్టుకోవడంతో కంటెస్టెంట్స్, జడ్జీలు భావోద్వేగానికి లోనయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



