"ఖాళీగా ఉన్న రోజుల్లో హీరో అవడమేంటి!": వీవీ వినాయక్‌పై బ్రహ్మానందం కామెంట్
on Oct 10, 2019

దర్శకుడు వీవీ వినాయక్‌ను ఉద్దేశించి "ఖాళీగా ఉన్నాం, హ్యాపీగా చేసుకుందాం అనుకునే రోజుల్లో హీరో అవడమేంటండీ!" అని ఆశ్చర్యం ప్రకటించారు వెటరన్ కమెడియన్ బ్రహ్మానందం. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించగా సి. కల్యాణ్ నిర్మించిన 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బ్రహ్మానందం.. నిర్మాత కల్యాణ్‌పై, హీరో అవుతున్న వీవీ వినాయక్‌పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
"నదిలో చేపలు ప్రవాహానికి అలా కొట్టుకుంటూ వెళ్లిపోతుంటాయి. ఒక రకం చేప మాత్రం ఎదురీతుతూ ఉంటుంది. అది.. పులస! అలాంటి వాడు సి. కల్యాణ్. ఎన్ని ఆటంకాలు వచ్చినా అలా వెళ్లిపోతుంటాడు, తన క్వాలిటీని నిలబెట్టుకుంటాడు. వినాయక్‌కు చిన్న సినిమా అంటే తెలీదు. ఒక కారు పెట్టాలంటే, మనకక్కడ వంద కార్లు కనపడుతుంటాయ్. ఒక సీన్‌లో పది మంది ఉంటే చాలంటే.. 'కాదు ఉండాలండీ' అని భారీగా ప్లాన్ చేస్తాడు. ఆయన సినిమా ఎంత భారీగా ఉంటుందో ఆయన మనసు కూడా అంత భారీగా ఉంటుంది. దగ్గరకొచ్చి చేయి చాపి అడిగినవాడ్ని, ఎవరైనా సరే, నాకు తెలిసి ఊరికినే, ఉట్టినే పంపించే మనిషి కాదు. ఖాళీగా ఉన్నాం, హ్యాపీగా చేసుకుందాం అనుకునే రోజుల్లో హీరో అవడమేంటండీ! ఇంతకంటే భగవంతుడి ఆశీస్సులు ఏముంటాయ్? మంచితనం ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. మంచితనం ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది." అన్నారు బ్రహ్మానందం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



