సమంత వర్సెస్ లారెన్స్.. 'శాకుంతలం' కలెక్షన్లకు 'రుద్రుడు' గండి కొడతాడా!
on Apr 13, 2023

గత వారం తెలుగులో 'రావణాసుర', 'మీటర్' సినిమాలు విడుదల కాగా.. రెండూ విజయాన్ని అందుకోలేకపోయాయి. 'రావణాసుర' కొంత పరవాలేదు అనిపించుకున్నా, మీటర్ మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ వారం మూడు సినిమాలు విడుదలవుతుండగా, అందులో రెండు డబ్బింగ్ సినిమాలే ఉన్నాయి. ఏప్రిల్ 14న 'శాకుంతలం', 'రుద్రుడు' రానుండగా.. ఏప్రిల్ 15న 'విడుదల-1' రానుంది.
ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో 'శాకుంతలం', 'రుద్రుడు' మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశముంది. సమంత టైటిల్ రోల్ పోషించిన 'శాకుంతలం'కు గుణశేఖర్ దర్శకుడు. గుణ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీపై ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. మౌత్ టాక్ తో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని మూవీ టీమ్ భావిస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
లారెన్స్ నటించిన 'రుద్రుడు'పై కూడా బజ్ లేదు. బుకింగ్స్ పెద్దగా లేవు. అయితే లారెన్స్ కి తెలుగులో మంచి మార్కెట్టే ఉంది. 'కాంచన' సిరీస్ తో మాస్ కి బాగా దగ్గరయ్యాడు. అందుకేనేమో 'రుద్రుడు' రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినప్పటికీ.. తెలుగులో ఏడు కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. మామూలుగా లారెన్స్ సినిమాలకు ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకొని వెళ్లే వారి కంటే, నేరుగా థియేటర్ కి వెళ్లి కౌంటర్ లో టికెట్ కొనుక్కునే వారు ఎక్కువ. దీంతో 'రుద్రుడు'కి కూడా అలాంటి మ్యాజిక్ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'విడుదల-1' ఇప్పటికే తమిళ్ లో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. వెట్రిమారన్ ని అభిమానించే వారే తప్ప, సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రంపై ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. అయితే 'కాంతార' తరహాలో ఈ చిత్రం కూడా తెలుగులో మౌత్ టాక్ తో సంచలనం సృష్టిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి ఈ వారం విడుదలవుతున్న ఈ మూడు చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



