1983 క్రికెట్ వరల్డ్ కప్ పై సినిమా..!
on Jun 8, 2016

భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి మరుపురాని క్షణం, చరిత్ర సృష్టించిన సమయం, ఇండియా వరల్డ్ కప్ గెలవటం. 1983లో కపిల్ డెవిల్స్ గెలిచి తీసుకొచ్చిన ఈ వరల్డ్ కప్, ఇండియాలోతో పాటు ప్రపంచంలోనే క్రికెట్ గతిని మార్చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించారు కపిల్ సేన. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు అవి. ఈ టోర్నీ మొదలయ్యే సమయానికి భారత్ ప్రపంచ క్రికెట్లో కేవలం పసికూనే. క్రికెట్ ఆట గురించి దేశంలోని ప్రజలకు కూడా పెద్దగా అవగాహన లేదు. అలాంటి సమయంలో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన భారత సేన, వరసగా జమాజట్టీలను ఓడిస్తూ ఫైనల్ చేరి వెస్టిండీస్ లాంటి భీకర్ టీంను మట్టి కరిపించి కప్ చేజిక్కించుకుంది.
ఇంత అద్భుతంగా సాగిన టీం ఇండియా పయనం అద్భుతమైన సినిమా కథగా పనికొస్తుంది కదా..! ఇదే ఆలోచన కలిగింది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను స్థాపించిన విష్ణు ఇందూరికి. అనుకున్నదే తడవుగా సినిమాపై గురించి తన ప్రయత్నం మొదలెట్టాడు. గత రెండేళ్లుగా కథపై ఆయన మథనం సాగుతోంది. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో, బాలీవుడ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని, త్వరలోనే పట్టాలెక్కబోతుందని సమాచారం. సినిమాలో కీలక మైన కపిల్ పాత్రకు ఎవరిని తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



