ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్.. 'దేవర' విడుదల వాయిదా?
on Dec 14, 2023

ఈ జనరేషన్ లో మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే వేగంగా సినిమాలు తీస్తాడనే పేరు జూనియర్ ఎన్టీఆర్ కి ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఎన్టీఆర్ వేగం తగ్గింది. గత ఆరేళ్లలో ఆయన నటించిన రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. 2018లో 'అరవింద సమేత'తో అలరించిన తారక్.. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లకు 2022 లో 'ఆర్ఆర్ఆర్'తో సందడి చేశాడు. ప్రస్తుతం 'దేవర'తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న దేవర రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో జరిగాయి. అయితే ఈసారి మార్చిలో జరిగే అవకాశముందని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈసారి కూడా ఏప్రిల్ లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో నిర్వహించే అవకాశముంది. అదే జరిగితే 'దేవర'ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైందంటే జనాలు పెద్దగా సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. పైగా దేవర లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కూడా ముఖ్యమే. మొండిగా ఎన్నికల సమయంలో సినిమాని విడుదల చేస్తే వసూళ్లపై తీవ్ర ప్రభావం పడి, తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి మేకర్స్ సినిమాని వాయిదా వేసే అవకాశముంది. ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి నెలకో, మే నెలకో వెళ్తే మాత్రం.. దేవర విడుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



