ENGLISH | TELUGU  

చిరంజీవి చేయాల్సిన 'ధ‌ర్మ‌యుద్ధం' భానుచంద‌ర్ చేశాడు!

on Apr 6, 2021

 

ప్ర‌ముఖ ర‌చ‌యిత మ‌ల్లాది వెంక‌ట‌కృష్ణ‌మూర్తి ర‌చించిన పాపుల‌ర్ న‌వ‌లల్లో 'ధ‌ర్మయుద్ధం' ఒక‌టి. ఆ రోజుల్లో అది సూప‌ర్ డూప‌ర్ హిట్ న‌వ‌ల‌. దాన్ని సినిమాగా తీయాల‌ని చాలామంది ప్ర‌య‌త్నించారు. అయితే ధ‌ర్మ‌యుద్ధం న‌వ‌ల‌ను సినిమా చేసే అవ‌కాశం న‌టుడు బెన‌ర్జీకి ద‌క్కింది. ఆ న‌వ‌లా నాయ‌కుడిగా న‌టించ‌డానికి చిరంజీవి సైతం ఆస‌క్తి చూపించారు. చేస్తాన‌నీ మాటిచ్చారు. కానీ చివ‌ర‌కు ఆయ‌న బ‌దులు భానుచంద‌ర్ ఆ సినిమా చేశాడు. సినిమాకు 'ధ‌ర్మ‌యుద్ధం' కాకుండా 'ఇదే నా న్యాయం' అనే టైటిల్ పెట్టారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బెన‌ర్జీ వెల్ల‌డించారు.

లేటెస్ట్‌గా ప్ర‌సార‌మైన ఆలీతో స‌ర‌దాగా షోలో స‌హ‌న‌టుడు జీవాతో క‌లిసి పాల్గొన్న బెన‌ర్జీ 'ఇదే నా న్యాయం' సినిమా సంగ‌తులు చెప్పుకొచ్చారు. నిర్మాత‌గా త‌న తొలి సినిమా 'ఇదే నా న్యాయం' అని తెలిపారు. "అది మ‌ల్లాది 'ధ‌ర్మ‌యుద్ధం' న‌వ‌ల ఆధారంగా తీసింది. ఆ న‌వ‌ల హాట్ కేక్‌. ఇండ‌స్ట్రీ మొత్తం ఆ న‌వ‌ల‌ను కొనాల‌ని ప్ర‌య‌త్నించింది. మ‌ల్లాది నా క్లోజ్ ఫ్రెండ్ అవ‌డం వ‌ల్ల‌, ఆ న‌వ‌ల కొన్నాను. అస‌లు నేను నిర్మాత‌ను అవ్వాల‌నుకోలేదు. డైరెక్ట‌ర్ నంద‌కుమార్ ఇండ‌స్ట్రీలో తాను చాలా కాలం నుంచి ఉన్నాన‌నీ, డైరెక్ట‌ర్ కాలేక‌పోతున్నాన‌నీ అంటుంటే, నేను సినిమా తీస్తాను సార్ అని ఆయ‌న‌తో చెప్పాను. నిజానికి అప్పుడు నా ద‌గ్గ‌ర డ‌బ్బులు కూడా లేవు. మ‌ల్లాది గారిని అడిగితే, నాకు ఆ న‌వ‌ల‌ను ఫ్రీగా ఇచ్చేశారు. ఆ వెంట‌నే చిరంజీవి గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాను. ఆయ‌న నంద‌కుమార్ గారికి కూడా ఫ్రెండే. 'ధ‌ర్మ‌యుద్ధం' న‌వ‌ల‌ను సినిమాగా తీద్దామ‌నుకుంటున్నాను, నంద‌కుమార్ డైరెక్ట‌ర్ అని చెప్పాను. నందు డైరెక్ట‌ర్ అయితే డెఫినెట్‌గా నేను సినిమా చేస్తానని చిరంజీవి గారు మాటిచ్చారు." అని బెన‌ర్జీ చెప్పారు.

అప్పుడు చిరంజీవికి ఎస్పీ వెంక‌న్న‌బాబు డేట్లు చూసేవారని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. "ఆ టైమ్‌లో చిరంజీవిగారు మూడు షిఫ్టులు ప‌నిచేస్తూ బాగా బిజీగా ఉన్నారు. రెండు నెల‌లు అయిపోయాయి. వెంక‌న్న‌బాబు గారు పిలిచి చిరంజీవిగారు అయితే సినిమా చేస్తాన‌న్నారు. కానీ ఇవ్వ‌డానికి డేట్లు లేవు. ఇంకో ఆరు నెల్ల‌దాకా ఆయ‌న ఫుల్ బిజీ. ఆరు నెల్లు వెయిట్ చేస్తావా? అన‌డిగారు. అంత కాలం ఆగితే, అప్ప‌టికే పాపుల‌ర్ అయిన ఆ న‌వ‌ల‌లోని సీన్ల‌ను ఎవ‌రైనా కాపీ చేస్తార‌నీ, ఇంకెవ‌రితోనైనా చెయ్య‌మ‌నీ పూర్ణ‌చంద్ర‌రావుగారు స‌ల‌హా ఇచ్చారు. హిందీలో ఆ సినిమాని తాను చేస్తాన‌న్నారు. అప్పుడు భానుచంద‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. చిరంజీవిగారికి చేయ‌డం కుద‌ర‌డం లేదు, చేస్తావా అన‌డిగాను. 'ధ‌ర్మ‌యుద్ధం' న‌వ‌ల అని చెప్పేస‌రికి వెంట‌నే ఆ త‌ర్వాత నెల్లోనే డేట్లు ఇచ్చాడు. భానుచంద‌ర్ హీరో, నంద‌కుమార్ డైరెక్ట‌ర్ అని అనౌన్స్ చేయ‌గానే డిస్ట్రిబ్యూట‌ర్లంద‌రూ డ‌బ్బులిచ్చేశారు. ఫైనాన్స‌ర్స్ డ‌బ్బులిచ్చేశారు." అని చెప్పుకొచ్చారు బెన‌ర్జీ.

అలా భానుచంద‌ర్‌, ర‌జ‌ని జంట‌గా నంద‌కుమార్ డైరెక్ట్ చేసిన 'ఇదే నా న్యాయం' చిత్రం 1986 ఏప్రిల్‌లో విడుద‌లైంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.