‘భక్షక్’ మూవీ రివ్యూ
on Feb 14, 2024
మూవీ : భక్షక్
నటీనటులు: భూమి పెడ్నేకర్, సంజయ్ మిశ్రా, సాయి తమంకర్, ఆదిత్య శ్రీవాత్సవ తదితరులు
రచన : జ్యోత్స్న నాథ్
ఎడిటింగ్: జుబిన్ షేక్
సినిమాటోగ్రఫీ: కుమార్ సౌరభ్
మ్యూజిక్ : అనురాగ్ శుక్లా, క్లింటన్ సెరోజో
నిర్మాతలు : గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పుల్ కిత్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
పుల్ కిత్ దర్శకత్వంలో భూమి పడ్నేకర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ' భక్షక్'. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
జర్నలిస్టు వైశాలి (భూమి పడ్నేకర్) పాట్నాలోని మునావర్ పూర్ లో సొంతంగా ఓ ఛానెల్ ని పెట్టుకొని స్టానిక వార్తలని అందిస్తుంటుంది. వైశాలికి సపోర్ట్ గా భాస్కర్ (సంజయ్ మిశ్రా) కెమెరా మెన్ గా పనిచేస్తుంటాడు. అయితే ఒకరోజు మునావర్ పూర్ లోని అనాధ బాలికల వసతి గృహంలో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని అక్కడి వారంతా కంప్లైంట్ చేసినా అక్కడి పోలీసు అధికారులు, నాయకులు ఎవరు పెద్దగా పట్టించుకోరు. దీనికి కారణం ఆ హాస్టల్ ని రన్ చేస్తోంది బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాస్తవ). కొంతమంది రాజకీయ నాయకులతో బన్సీలాల్ కి ఉన్న సంబంధాలే పోలీసులు అటువైపు చూడరు. అయితే ఆ వసతి గృహంలో జరిగే దారుణాల గురించి తెలుసుకున్న వైశాలి ఏం చేసింది? బన్సీలాల్ కి శిక్ష పడేలా చేసిందా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అనాథలుగా మారిన కొంతమంది ఆడపిల్లల కోసం ఉద్యమం చేసిన జర్నలిస్టు వైశాలీ కథే ఈ భక్షక్. అనాథల వసతిగృహంలో బన్సీలాల్ ఆగడాలని చూపిస్తూ మెల్లిగా కథలోకి తీసుకెళ్ళాడు డైరెక్టర్. ఆ తర్వాత వైశాలి పాత్ర చుట్టూ కథని తిప్పుతూ కాస్త టైమ్ తీసుకున్నాడు. ఇదంతా అనవసరం అనిపిస్తుంది.
వైశాలి పాత్రని సహజంగా చూపించడానికి దర్శకుడు పుల్ కిత్ కష్టం స్క్రీన్ మీద తెలుస్తోంది. అయితే కథలో స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగడం, పెద్దగా సస్పెన్స్ లేకపోవడం ప్రేక్షకులకి కాస్త నిరాశని కలిగిస్తాయి. ఎప్పుడైతే వైశాలికి ఎస్పీ జస్మీత్ కౌర్( సాయి తమంకర్) తోడవుతుందో అప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. మీలో మానవత్వం ఇంకా మిగిలే ఉందా? మీరు కూడా వాళ్ళలాగా భక్షకులేనా అని జర్నలిస్టు వైశాలి చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి.
2018 లో జరిగిన యదార్థ సంఘటన ఇది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా సాగదీసే సీన్లతో, కొన్ని అడల్ట్ పదజాలంతో ఇంట్రస్ట్ కల్పించలేకపోయింది. ప్రథమార్ధంలో మొదటి పది నిమిషాలు, ఇంటర్వెల్ సీన్.. క్లైమాక్స్ లో పది నిమిషాలు తప్ప సినిమా మధ్యలో మొత్తం వృధానే అనిపిస్తుంది. ల్యాగ్ సీన్లతో ప్రేక్షకులని ఇబ్బంది పెట్టారు. భూమి పడ్నేకర్ చెప్పే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ మినహా ఎక్కడా అంత ఇంటెన్స్ క్రియేట్ చేయలేకపోయింది సినిమా. సినిమా మధ్యలో చైల్డ్ అబ్యూజింగ్ సీన్స్ వస్తాయి. మధ్యలో అశ్లీల పదాలు బాగానే వాడారు. ఇవేమీ ఇబ్బంది కల్గించవంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
అనాథలైతే మాత్రం ప్రెగ్నెంట్ అయితే చంపేయడమేంటి.. అలాంటి ఓ వాస్తవ సంఘటనని మరింత ఎమోషనల్ గా చూపించొచ్చు. కానీ ఇంతటి స్ట్రాంగ్ పాయింట్ ని వదిలేసి మొత్తం ల్యాగ్ సీన్లతో నింపేశారు దర్శకుడు పుల్ కిత్. ఆ పాయింట్ ని హైలైట్ చేసి సాగదీత సీన్లని ట్రిమ్ చేసి నిడివిని కాస్త తగ్గించి ఉంటే ఈ సినిమా విజయం సాధించేది. కుమార్ సౌరభ్ సినిమాటోగ్రఫీ బాగుంది. జుబిన్ షేక్ ఎడిటింగ్ పర్వాలేదు. అనురాగ్ శుక్లా మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
భూమి పడ్నేకర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. సంజయ్ మిశ్రా, సాయి తమంకర్ , ఆదిత్య శ్రీవాత్సవ ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఫైనల్ గా:
కుటుంబంతో కలిసి ఓసారి చూడొచ్చు. కాస్త ఓపికగా చూడాలి అంతే.
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
