బాలయ్య, రోజా జోడి.. మరోసారి థియేటర్లలో సందడి!
on Jul 25, 2023

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఎవర్ గ్రీన్ సినిమాలలో 'భైరవ ద్వీపం' ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ జానపద చిత్రం 1994 ఏప్రిల్ 14 విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచి అమితంగా ఆకట్టుకుంది. చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది. విజయ్ గా బాలకృష్ణ, యువరాణి పద్మావతి గా రోజా జోడి వెండితెరపై కనువిందు చేసింది. ఇందులో కురూపిగా బాలయ్య నటనకు ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన కథాకథనాలు, విజువల్స్, సంగీతంతో ఈ సినిమా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. 29 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ క్లాసిక్ ఫిల్మ్ మరోసారి థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది.
టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు రీ రిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే బాలయ్య నటించిన 'చెన్నకేశవరెడ్డి' మళ్ళీ విడుదలై మంచి వసూళ్లు రాబట్టగా, ఇప్పుడు 'భైరవ ద్వీపం' కూడా రీరిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమాని ఆగస్టు 5న రీ-రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. మరి 'భైరవ ద్వీపం' మూవీ రీరిలీజ్ లో ఏస్థాయి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



