'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. బాలయ్య వర్సెస్ విజయ్!
on Jul 22, 2023

'అఖండ', 'వీరసింహారెడ్డి' రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో.. బాలయ్య తదుపరి చిత్రం 'భగవంత్ కేసరి'పై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు నటసింహం. ఇందులో బాలయ్యకి జంటగా కాజల్ అగర్వాల్ కనిపించనుండగా.. ఓ ముఖ్య పాత్రలో శ్రీలీల దర్శనమివ్వబోతోంది. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
ఇదిలా ఉంటే.. దసరా కానుకగా 'భగవంత్ కేసరి' థియేటర్స్ లోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన యూనిట్.. శనివారం (జూలై 22) సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. "భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది".. అంటూ కొత్త పోస్టర్ లో అక్టోబర్ 19ని రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో బాలకృష్ణ రెండు చేతుల్లో ఆయుధాలతో వీరోచితంగా కనిపిస్తున్నారు. తన వెనుక రౌడీ బ్యాచ్ గాయాలతో బాధపడుతున్నట్లు చూపించారు. ముందు కూడా గ్యాంగ్ తాలూకు మనుషులు కనిపిస్తున్నారు. పోస్టర్ డిజైన్ బట్టి.. సినిమాలో కీలక సందర్భంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ లా అనిపిస్తుంది. మొత్తంగా.. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇదే అక్టోబర్ 19న దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన 'లియో' రిలీజ్ కానుంది. 'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' వంటి వరుస విజయాల తరువాత లోకేశ్ కనకరాజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. తమిళ అనువాద చిత్రమైనప్పటికీ 'లియో'పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి.. బాలయ్య వర్సెస్ విజయ్ అన్నట్లుగా ఉన్న అక్టోబర్ 19 పోరులో ఎవరు బాక్సాఫీస్ విన్నర్ అవుతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



