ENGLISH | TELUGU  

'బంగారు బుల్లోడు' మూవీ రివ్యూ

on Jan 23, 2021

 

 

 

సినిమా పేరు: బ‌ంగారు బుల్లోడు

తారాగ‌ణం: అల్ల‌రి న‌రేష్‌, పూజా ఝ‌వేరి, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్ ఘోష్‌, పృథ్వీ, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, అనంత్‌, భ‌ద్రం,  సారిక రామ‌చంద్ర‌రావు, రామ‌ప‌త్ర నిత్ర వెలిగొండ శ్రీ‌నివాస్‌.
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి
మ్యూజిక్‌: సాయి కార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వ‌ర్మ‌
ఆర్ట్‌: ఎన్‌. గాంధీ
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి
స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గిరి పాలిక‌
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల తేదీ: 23 జ‌న‌వ‌రి 2021

టీవీల‌లో, యూట్యూబ్ చాన‌ళ్ల‌లో కామెడీ షోలు, కామెడీ సిరీస్ రావ‌డం మొద‌ల‌య్యాక టాలీవుడ్ స్క్రీన్‌పై కామెడీ సినిమాల హ‌వా త‌గ్గిన‌ట్లు అనిపిస్తుంది. కామెడీ హీరోగా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఓ వెలుగు వెలిగారు. ఆయ‌న త‌ర్వాత ఆ ప్లేస్‌ను అల్ల‌రి న‌రేశ్ ఆక్ర‌మించేస్తాడ‌ని చాలా మంది ఊహించారు. 2012లో వ‌చ్చిన 'సుడిగాడు' సినిమాతో న‌రేశ్ ఈ న‌మ్మ‌కాన్ని ఎక్కువ‌గా క‌లిగించాడు. బ‌ట్‌.. ఎవ‌రూ ఎక్స్‌పెక్ట్ చేయ‌ని విధంగా 'సుడిగాడు' మూవీ త‌ర్వాత ఆ రేంజ్‌లో కానీ, దానికి ద‌గ్గ‌ర‌గా కానీ న‌రేశ్ సినిమాలు ఆడియెన్స్‌ను అల‌రించ‌లేక‌పోతున్నాయి. కామెడీ షోలు, సిరీస్‌లు ఆడియెన్స్‌కు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తూ రావ‌డం దీనికి ఓ కార‌ణం కావ‌చ్చు. 

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి కామెడీతో ఆడియెన్స్‌ను ఎలాగైనా ఎట్రాక్ట్ చెయ్యాల‌ని 'బంగారు బుల్లోడు' పేరుతో మ‌న‌మందుకు వ‌చ్చాడు అల్ల‌రి న‌రేశ్‌. ఇది కామెడీ సినిమా అయినా సినిమాలో న‌రేశ్  ఎక్క‌డా కామెడీ చెయ్య‌డు. పైగా అత‌నో ప్రాబ్లెమ్‌లో చిక్కుకొని, దాన్నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చేసే ప్ర‌య‌త్నాలు కామెడీని క‌లిగిస్తుంటాయి. న‌వ్వించ‌డానికి కొన్ని క్యారెక్ట‌ర్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. 

క‌థ‌

సినిమాలో న‌రేశ్ చేసిన క్యారెక్ట‌ర్ పేరు భ‌వానీ ప్ర‌సాద్‌. ఓ కోప‌రేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. బంగారు న‌గ‌ల‌ను తాక‌ట్టు పెట్టుకొని లోన్లు ఇచ్చే బ్యాంక్ అది. అత‌ను క‌డుపులో ఉండ‌గానే త‌ల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చ‌నిపోతారు. మొత్తానికి డాక్ట‌ర్లు త‌ల్లి క‌డుపులో ఉన్న బిడ్డ‌ను కాపాడ‌తార‌న్న మాట‌. అత‌నికి బంగారం ప‌నిచేసే ఓ తాత‌య్య‌, పేకాడుతూ బ‌లాదూర్‌గా తిరిగే ఇద్ద‌ర‌న్న‌య్య‌లు ఉంటారు. తాత‌య్య క్యారెక్ట‌ర్‌ను త‌నికెళ్ల భ‌ర‌ణి, అన్న‌ల క్యారెక్ట‌ర్ల‌ను స‌త్యం రాజేశ్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను చేశారు. 

26 ఏళ్ల క్రితం యాక్సిడెంట్‌కు గురై ప్రాణాపాయంలో ఉన్న త‌న కొడుకు కోడ‌ల్ని కాపాడుకోడానికి ప్ర‌సాద్ తాత‌య్య ఆ ఊరి గుడిలోని మావుళ్ల‌మ్మ అమ్మవారి న‌గ‌ల‌ను దొంగ‌లించి, వాటి ప్లేస్‌లో గిల్టు న‌గ‌ల్ని పెడ‌తాడు. డ‌బ్బుగా మారిన న‌గ‌లూ పోయి, కొడుకూ కోడ‌లు కూడా ద‌క్క‌ని ఆయ‌న.. ‌ఇన్నేళ్లుగా ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌కుండా ప‌శ్చాత్తాపంతో కుమిలిపోతుంటాడు. ఇప్పుడు ఆ గుడిని దేవాదాయ శాఖ‌వారు స్వాధీనం చేసుకుంటార‌నే విష‌యం తెలియడంతో గుండెపోటుకు గురైన ఆ తాత‌య్య 26 ఏళ్ల ర‌హ‌స్యాన్ని త‌న మ‌న‌వ‌డు ప్ర‌సాద్‌కు చెప్తాడు. నెల రోజుల్లో గిల్టు న‌గ‌ల స్థానంలో బంగారు న‌గ‌ల‌ను పెట్టాల‌నే టార్గెట్ పెట్టుకుంటాడు ప్ర‌సాద్‌. ఆ ల‌క్ష్య సాధ‌న‌లో అత‌ను ఎలాంటి క‌ష్టాలు, ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడ‌నే విష‌యాన్ని వినోదాత్మ‌కంగా చెప్పాల‌ని డైరెక్ట‌ర్ గిరి పాలిక ట్రై చేశాడు. 

విశ్లేష‌ణ‌

అల్ల‌రి న‌రేశ్ తండ్రి ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌గ్గ‌ర రైట‌ర్‌గా ప‌నిచేసిన గిరి పాలిక ఈ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. బ‌హుశా అందుకే కాబోలు, అత‌ని డైరెక్ష‌న్‌లో ఈవీవీ స్టైల్ క‌నిపించింది. తాత‌య్య‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోడానికి న‌రేశ్ చేసే ప్ర‌య‌త్నాలు చూస్తుంటే, అత‌ను ఎదుటివాళ్ల‌కు దొరికిపోతాడేమో అనే టెన్ష‌న్ అత‌డితో పాటు ప్రేక్ష‌కులకూ క‌లుగుతుంది. కానీ ఆ సీన్ల‌ను ఓల్డ్ ఫార్మ‌ట్‌లో తీశాడు డైరెక్ట‌ర్‌. అందుకే 'బంగారు బుల్లోడు' సినిమా చూస్తుంటే.. 1980, 90ల‌లో వ‌చ్చిన కామెడీ సినిమాల‌ను చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంద‌న్న మాట‌. 

న‌టీన‌టుల అభిన‌యం

అల్ల‌రి న‌రేశ్‌కు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండే. అయినా కూడా ఎందుక‌నో 'బంగారు బుల్లోడు'గా ఫ్రీగా న‌టించ‌లేక‌పోయాడు. కొన్ని సీన్లు బాగా చేసినా, హుషారుగా క‌నిపించాల్సిన సీన్ల‌లో అత‌ని ముఖంలో ఆ ఫీలింగ్ ప‌ల‌క‌లేదు. ఫారిన్ పెళ్లికొడుకు కోసం వెంప‌ర్లాడే హీరోయిన్ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి రోల్ కానీ, ఆ రోల్‌లో పూజా జ‌వేరి కానీ ఆకట్టుకోలేదు. ఒక‌ప్పుడు బాల‌కృష్ణ‌, ర‌వీనా టాండ‌న్ జంట‌గా వ‌చ్చిన 'బంగారు బుల్లోడు' సినిమా, ఆ సినిమాలో ఇ ఇద్ద‌రిపై పిక్చ‌రైజ్ చేసిన "స్వాతిలో ముత్య‌మంత ముద్దులా ముట్టుకుంది" అనే రెయిన్ సాంగ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌తో తీసిన సినిమాలో ఆ రెయిన్ సాంగ్‌ను కూడా వాడేసుకున్నారు. వేటూరి రాసిన లిరిక్స్‌ను య‌థాత‌థంగా ఉంచేసి, ట్యూన్స్‌ను రీమిక్స్ చేసి, పాడించారు. ఆ పాట వ‌ర‌కు ఫర్వాలేదు. 

న‌రేశ్ తాత‌య్య‌గా న‌టించిన త‌నికెళ్ల భ‌ర‌ణి.. పాత సినిమాల్లోని తాత‌య్య క్యారెక్ట‌ర్ల‌ను గుర్తుకు తెచ్చారు. ఆయ‌న పాత్ర తీరు అలాగే ఉంది. అమ్మ‌వారి న‌గల చోరీ కేసును ద‌ర్యాప్తు చేయ‌డానికి వ‌చ్చే సీఐ ఆదినారాయ‌ణ క్యారెక్ట‌ర్‌ను స‌రిగా డిజైన్ చేయ‌లేదు. అందువ‌ల్ల ఆ క్యారెక్ట‌ర్‌ను అజ‌య్ ఘోష్ ఎంత బాగా చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. హీరోయిన్ తండ్రి వ‌డ్డీ వ్యాపారి బొడ్డు నాగ‌రాజు పాత్ర‌లో పోసాని కృష్ణ‌ముర‌ళి క‌రెక్టుగా ఫిట్ట‌యి ఆక‌ట్టుకున్నాడు. అలాగే హీరోయిన్‌ను చూసుకొనేందుకు సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన పెళ్లికొడుకుగా వెన్నెల కిశోర్ త‌న డైలాగ్ డిక్ష‌న్‌తో అల‌రించాడు. బ్యాంక్ మేనేజ‌ర్‌గా పృథ్వీకి కానీ, ఆ బ్యాంక్‌లో ప‌నిచేసే శ్యామ‌ల‌కు కానీ న‌టించ‌డానికి పెద్ద‌గా అవ‌కాశం ల‌భించ‌లేదు. హీరో అవారా అన్న‌లుగా స‌త్యం రాజేశ్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, హీరో ఫ్రెండ్‌గా ప్ర‌వీణ్ స‌రిగ్గా స‌రిపోయారు. టెక్నిక‌ల్‌గా చెప్పుకోడానికి పెద్ద‌గా ఏమీ లేదు. అక్క‌డ‌క్క‌డ కొన్ని స‌న్నివేశాలు, డైలాగ్స్ న‌వ్విస్తాయి. సాయికార్తీక్ సంగీతం జ‌స్ట్ ఓకే. సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్‌, ఆర్ట్ డైరెక్ష‌న్ సాధార‌ణ స్థాయిలో ఉన్నాయి.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌

చివ‌రాఖ‌రుకి క్లైమాక్స్ కూడా సాధార‌ణ స్థాయిలో ఉండ‌టంతో థియేట‌ర్ బ‌య‌ట‌కు ఓ "ఇత్త‌డి బుల్లోడు"ను చూసిన ఫీలింగ్‌తో వ‌స్తాం.

రేటింగ్‌: 2/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.