పవన్ 'భీమ్లా నాయక్' చేయడానికి కారణం బాలయ్యే!
on Oct 21, 2022

మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్'కి తెలుగు రీమేక్ గా రూపొందిన చిత్రం 'భీమ్లా నాయక్'. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయంలో వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ నటిస్తే బాగుంటుందని నిర్మాతలకు సూచించింది నందమూరి బాలకృష్ణ కావడం విశేషం.
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' సీజన్-2 రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు. వీరితో పాటు ఈ ఎపిసోడ్ లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య "భీమ్లా నాయక్ ఫస్ట్ హీరో ఎవరు?" అని అడగగా.. "మీరే కదా సార్" అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు వంశీ. "అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కోసం మీ చుట్టూ తిరిగితే, సినిమా చూసి మీరే కదా సార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేసింది" అంటూ వంశీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'ఈ సినిమా ఆయన చేస్తే బాగుంటుంది' అని ఒక హీరో పేరుని మరో హీరో సజెస్ట్ చేసే అంత బాండింగ్ వారి మధ్య ఉంటే.. కొందరు అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని దెబ్బలాడుతుంటారు. ఇలాంటివి చూసైనా అలాంటి అభిమానుల తీరులో మార్పు వస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



