వచ్చే సంక్రాంతి సంగతేంటి!?
on Feb 8, 2023

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డిలతో పోటీపడ్డారు. ఇక వచ్చే సంక్రాంతికి ఎవరెవరు పోటీలో ఉంటారు అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పటు ది రూల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఆర్సి15 చిత్రం కూడా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీటితోపాటు పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో నిర్మితం కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను వచ్చే సంక్రాంతి పోటీలో నిలబెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి మెగా కాంపౌండ్ హీరోల మధ్య గట్టి పోటీ ఎదురు కానుంది. ఇక వచ్చే సంక్రాంతి బరిలో బాలయ్య కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య ఈసారి అనిల్ రావిపూడి చిత్రంతో వచ్చే సంక్రాంతికి బరిలో దిగాలని భావిస్తున్నారు. ముందుగా ఇదే ఏడాది విడుదల చేయాలని భావించినా కూడా మరీ తొందరగా సినిమాని తీయడం ఇష్టం లేక తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని బాలయ్యతో పాటు అనిల్ రావిపూడి కూడా భావిస్తున్నారట. మొత్తానికి ఈ చిత్రం వేగంగా పూర్తి చేసినా సరే మరో దర్శకుడితో అంతే త్వరగా సినిమా తీసి ఎలాంటి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో నిలవాలనేది బాలయ్య పంతం అని సమాచారం.
ఇక కొంతకాలంగా ది ఘోస్ట్ తర్వాత మౌనంగా ఉన్న నాగార్జున సైతం రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ను దర్శకునిగా పరిచయం చేస్తూ తెరకెక్కించే చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ చిత్రం కూడా సంక్రాంతి పోటీకి రెడీ అంటుంది. అయితే వెంకటేష్ మాత్రం సంక్రాంతి పోటీకి పడకుండా కాస్త ముందుగా క్రిస్మస్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో టైగర్ నాగేశ్వరరావుతో వచ్చే క్రిస్మస్ ని రవితేజ కూడా కన్నేసి ఉన్నారు. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో మరోసారి గట్టి పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



