ENGLISH | TELUGU  

'బేబీ' మూవీ రివ్యూ 

on Jul 14, 2023

సినిమా పేరు: బేబీ 
తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరిష, సీత, వైవా హర్ష, కుసుమ, సాత్విక్ 
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్: ఎం.ఎన్. బాల్ రెడ్డి
ఆర్ట్: సురేష్
ఎడిటర్: విప్లవ్ నైషధం 
రచన, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం
నిర్మాత: ఎస్.కె.ఎన్
బ్యానర్: మాస్ మూవీ మేకర్స్ 
విడుదల తేదీ: జూలై 14, 2023 

ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ప్రేమ కథా చిత్రమంటే 'బేబీ' అని చెప్పొచ్చు. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా పాటలు, ప్రచార చిత్రాలతో యువత దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉందా?...

కథ:
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైష్ణవి(వైష్ణవి చైతన్య) హైదరాబాద్ లో ఒకే బస్తీలో నివసిస్తుంటారు. పదవ తరగతి నుంచే వీరు ప్రేమించుకుంటారు. ముందు వైష్ణవి ఆనంద్ ని ప్రేమిస్తుంది. వైష్ణవి ప్రేమకి మెచ్చి ఆనంద్ కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అలా కొంతకాలం గడిచాక, ఆనంద్ పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆటో నడుపుతుంటాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి, పెద్ద కాలేజ్ లో ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది. కాలేజ్ బాగా దూరం కావడం, ఇద్దరు మాట్లాడుకోవడం కుదరదన్న ఉద్దేశంతో.. ఆనంద్ అప్పు చేసి మరీ రెండు ఫోన్లు కొని, ఒకటి వైష్ణవికి ఇస్తాడు. కాలేజ్ లో జాయిన్ అయ్యాక కొద్దిరోజులు బాగానే ఉన్న వైష్ణవి తర్వాత అక్కడ ఆకర్షణలకు లోనవుతుంది. అందం మీద, రిచ్ లైఫ్ మీద దృష్టి పెడుతుంది. ఆనంద్, ఆమె తండ్రి(నాగబాబు) వారిస్తున్నా వినదు. ఈ క్రమంలోనే వైష్ణవి కాలేజ్ లో విరాజ్(విరాజ్ అశ్విన్)కి బాగా దగ్గరవుతుంది. ఒకవైపు ఆనంద్ తో ప్రేమ అంటూనే, మరోవైపు విరాజ్ తో చనువుగా ఉంటుంది. విరాజ్ కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అటు ఆనంద్ ని వదులుకోలేదు, ఇటు విరాజ్ ని వదిలించుకోలేదు. ఒకరిని ప్రేమిస్తూ మరొకరికి దగ్గరైన వైష్ణవి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆనంద్, విరాజ్ లలో వైష్ణవి ఎవరి సొంతమైంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
బేబీ కథ కొత్తదేమీ కాదు. ఇలాంటి కథలు మనం నిజ జీవితంలో చూస్తుంటాం, వింటుంటాం. ఒకబ్బాయితో ప్రేమలో ఉండి, మరో అబ్బాయికి దగ్గర అవ్వడం.. దాని వల్ల ఆ అమ్మాయి జీవితంతో పాటు ఇద్దరు అబ్బాయిల జీవితాల మీద ప్రభావం పడటం అనేది తరచూ వార్తల్లో కూడా చూస్తుంటాం. అలా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంది. పరిపక్వత లేని అమ్మాయి తీరు వల్ల తనతో పాటు తనను ప్రేమించినవాళ్లు ఎలాంటి బాధను అనుభవిస్తారో తెలిపే చిత్రమిది.

'హృదయ కాలేయం' అనే కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి రాజేష్, ఆ తర్వాత 'కొబ్బరిమట్ట', 'కలర్ ఫొటో' సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. 'కలర్ ఫొటో' సినిమాతోనే రచయితగా ఆయనలో మరో కోణం ఉందని ప్రేక్షకులకు అర్థమైంది. ఇక ఇప్పుడు 'బేబీ'తో ఆయనలో ఎంత సున్నితమైన, లోతైన రచయిత ఉన్నాడో స్పష్టమైంది. మద్యానికి బానిసై, ప్రేయసి ఆలోచనలతో గడిపేస్తున్న ఆనంద్ పాత్రను పరిచయం చేస్తూ సినిమాని ప్రారంభించిన దర్శకుడు.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆనంద్, వైష్ణవి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అలరిస్తాయి. ఆ పాత్రలను మలిచిన తీరు బాగుంది. వైష్ణవి పరిపక్వత లేకుండా వేసే అడుగుల కారణంగా ఆనంద్ బాధపడే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. పాత్రలు, సన్నివేశాలు మనం గతంలో చూసినట్టుగా అనిపించినప్పటికీ, కథనంలో ఊహించని మలుపులు లేనప్పటికీ ప్రథమార్థం బాగానే నడిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు మెప్పిస్తాయి.

ద్వితీయార్థం బాగా ఎమోషనల్ గా సాగింది. ఏమాత్రం ఆలోచన లేకుండా తొందరపాటులో వైష్ణవి ఒక తప్పు చేయడం, దాని నుంచి బయటపడటం కోసం ఇంకా పెద్ద తప్పు చేయడం. ఇలా ఆమె తొందరపాటు నిర్ణయాలు ఆమెని, ఆమె ప్రేమని ప్రమాదంలోకి నెట్టే సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాని ముగించిన తీరు కూడా వాస్తవానికి దగ్గరగా ఉంది. 

బస్తీ నుంచి ఒక పెద్ద కాలేజీకి వెళ్లి అక్కడి మనుషులు, వాతావరణానికి ఆకర్షితురాలై తాను తప్పడడుగులు వేసి తన వాళ్ళ బాధకి కారణమైన వైష్ణవి పాత్రను చూపించిన దర్శకుడు.. అదే సమయంలో వైష్ణవి స్నేహితురాలు కుసుమ పాత్ర ద్వారా మన ఆలోచనలు, మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఎలాంటి వాతావరణంలో ఉన్నా చెడు దారిలో వెళ్ళము అని చెప్పిన తీరు బాగుంది. మొత్తానికి సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే కొన్ని అభ్యంతరకర సంభాషణలు, బోల్డ్ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులు ఇబ్బంది పడేలా ఉన్నాయి. ఆ అభ్యంతరకర సంభాషణలను వదిలేస్తే మాత్రం సినిమాలోని మిగతా సంభాషణలు అర్థవంతంగా బాగున్నాయి. అయితే ఆనంద్ పాత్ర స్వభావానికి తగ్గట్టు పొయెటిక్ డైలాగ్స్ బాగున్నా, కొన్ని సందర్భాల్లో విరాజ్ సైతం తన పాత్ర స్వభావానికి భిన్నంగా అదే శైలిలో మాట్లాడటం ఆర్టిఫిషియల్ గా అనిపించింది.

బేబీ సినిమా విషయంలో సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ని ప్రత్యేకంగా అభినందించాలి. పాటలతో విడుదలకు ముందే సినిమాని ప్రేక్షకులలోకి బలంగా తీసుకెళ్లిన విజయ్, నేపథ్య సంగీతంతోనూ సినిమాని నిలబెట్టాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎం.ఎన్. బాల్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. ఎడిటర్ విప్లవ్ సినిమాని నీట్ గా ప్రజెంట్ చేశాడు. నిడివిని కాస్త కుదించే ప్రయత్నం చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
కన్న వాళ్ళ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమే గొప్పది అనుకొని, జీవితాన్ని పాడు చేసుకునే ఆనంద్ అనే ఓ సాధారణ యువకుడితో పాత్రలో ఆనంద దేవరకొండ ఒదిగిపోయాడు. అతనికి నటనకి ఆస్కారమున్న మంచి పాత్ర లభించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంది. నిజ జీవితంలో కొందరి తీరుకి అద్దం పట్టేలా ఉన్న వైష్ణవి పాత్రకి వైష్ణవి చైతన్య పూర్తి న్యాయం చేసింది. కొన్ని సన్నివేశాల్లో మేకప్ సెట్ అవ్వలేదు అనిపించినా, నటన పరంగా మాత్రం దర్శకుడి నమ్మకాన్ని నిజం చేసింది. వైష్ణవిని ప్రేమించి, ఆమెని ఎలాగైనా దక్కించుకోవాలి అనుకునే విరాజ్ పాత్రలో విరాజ్ అశ్విన్ కూడా చక్కగా రాణించాడు. వైష్ణవి తండ్రిగా నాగబాబు కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ బలమైన ప్రభావం చూపించారు. లిరిష, సీత, వైవా హర్ష, కుసుమ, సాత్విక్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవ సంఘటనలకు, సమాజంలోని కొందరి మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉన్న ఈ ముక్కోణపు ప్రేమకథ యువతను మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకర సంభాషణలు, బోల్డ్ సన్నివేశాలు మాత్రం కుటుంబ ప్రేక్షకులు ఇబ్బంది పడేలా ఉన్నాయి.

రేటింగ్: 2.75/5 

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.