
కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు నిర్మించడం మలయాళ చిత్రసీమ స్పెషాలిటీ. అందుకే చాలా చిత్రాలు తెలుగులోను డబ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంటున్నాయి. ఓటిటిలో కూడా వచ్చి రికార్డులు సృష్టిస్తున్నాయి.ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులలో మలయాళ కామెడీ, డ్రామా సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథలతో పాటు సహజత్వానికి దగ్గరగా ఉండటం వలన ఎంతగానో ఆదరిస్తున్నారు.
ఇప్పుడు అదే కోవలో కేవలం నెల రోజుల క్రితం థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ కామెడీ 'అతిరడి' 'సోనీ లివ్' (SonyLIV) వేదికగా జూన్ 19, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ అందుబాటులోకి రానుండటం విశేషం.టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ కీ రోల్స్. 2021లో వచ్చిన సూపర్ హీరో చిత్రం 'మిన్నల్ మురళి' తర్వాత టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. కథ విషయానికి వస్తే.. ఇది ఒక ఆసక్తికరమైన క్యాంపస్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అయిన సామ్‌కుట్టి (బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో కొన్నేళ్ల క్రితం ఒక దురదృష్టకరమైన తొక్కిసలాట కారణంగా నిషేధానికి గురైన 'ఆరోహణ్' అనే ప్రతిష్టాత్మక కల్చరల్ ఫెస్టివల్‌ను మళ్లీ ప్రారంభించాలని పట్టుబడతాడు. ఎలాగైనా ఆ ఫెస్ట్‌ని ఘనంగా నిర్వహించి, తన కలలను నిజం చేసుకోవాలని చూస్తుంటాడు. అయితే, అతని ప్రయత్నాలకు ఒక ఊహించని అడ్డంకి ఎదురవుతుంది. గతంలో ఆ కాలేజీ ఫెస్ట్ బ్యాన్ అవ్వడానికి కారణమైన మాజీ రౌడీ, ప్రస్తుత సంగీతకారుడు శ్రీకుట్టన్ వెల్లాయణి (టొవినో థామస్) రూపంలో సామ్‌కుట్టికి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. తన లైవ్ మ్యూజిక్ షోని సక్సెస్ చేసుకోవాలనే ఈగోతో శ్రీకుట్టన్ మళ్లీ పాత రౌడీ అవతారమెత్తి కాలేజీ ఫెస్టివల్‌ని ఆపాలని చూస్తాడు.
Also read: Madhuri dixit: మహిళా క్యారక్టర్లపై మాధురీ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఇద్దరి మధ్య జరిగే ఇగో క్లాషెస్, ఆధిపత్య పోరు మరియు కామెడీ సన్నివేశాలతో దర్శకుడు అరుణ్ అనిరుధన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాకుండా, సినిమాలో వచ్చే ఒక సర్ప్రైజ్ కామియో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది. విష్ణు విజయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. రియా షిబు, వినీత్ శ్రీనివాసన్, జరిన్ షిహాబ్, షాన్ రెహమాన్, దర్శన రాజేంద్రన్ వంటి స్టార్ కాస్టింగ్ మిగతా క్యారెక్టర్స్ లలో కనిపించారు.






