
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం పౌజీ, కల్కి 2 ,స్పిరిట్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ముడు చిత్రాలపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ప్రీవియస్ కెరీర్ ని ఒకసారి చూసుకుంటే భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో 2012లో విడుదలైన 'రెబల్' ఒకటి. ఈ సినిమా కమర్షియల్‌గా తీవ్ర నష్టాలని మిగల్చడమే కాకుండా, అప్పట్లో నిర్మాతలు దర్శకుడు రాఘవ లారెన్స్ మధ్య ఒక పెద్ద వివాదానికి దారితీసింది. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రెబల్ చిత్ర నిర్మాతలు జె. భగవాన్ మరియు జె. పుల్లా రావు పాల్గొని, ఆనాటి చేదు జ్ఞాపకాలను మరియు లారెన్స్‌తో జరిగిన గొడవలని మరోసారి బహిరంగంగా పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.
వాళ్ళు మాట్లాడుతు రెబల్ ని కేవలం 22.5 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేస్తానని లారెన్స్ హామీ ఇచ్చాడు.బడ్జెట్ పరిమితులకి లోబడే ఫస్ట్ కాపీని అందిస్తానని లిఖితపూర్వకంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు . అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత లారెన్స్ ప్రవర్తన, సినిమా మేకింగ్ శైలి పూర్తిగా మారిపోయింది. ప్రణాళిక లేని రీషూట్‌లు, షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడం వల్ల సినిమా నిర్మాణం దాదాపు రెండు సంవత్సరాల పాటు సాగింది. దీనివల్ల ప్రాజెక్ట్ ఖర్చు అంచనాలకు మించిపోతూ వచ్చింది. చివరికి 22.5 కోట్ల బడ్జెట్ కాస్తా 40 కోట్లకి చేరుకుంది. అంటే దాదాపు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు పెట్టించాడు. ఆ సమయంలో ప్రభాస్ మార్కెట్ పరిధిని మించి ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం భారీ రిస్క్‌గా మారింది.
Also read: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ.. డేట్ ఇదే
సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్న సమయంలోనే రాఘవ లారెన్స్ తన సొంత ప్రాజెక్ట్ 'కాంచన' పూర్తి చేసి విడుదల చేసుకున్నాడు. కానీ 'రెబల్'ని మాత్రం నిర్లక్ష్యం చేసాడు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభాస్ పెదనాన్న దివంగత ప్రముఖ నిర్మాత కృష్ణంరాజు గారు ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందే హెచ్చరించారు. లారెన్స్‌తో సినిమా చేసేటప్పుడు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బందులు వస్తాయి" అని ఆయన ముందే తమకు చెప్పారు. కానీ ఆ సమయంలో తాము ఆ హెచ్చరికని సీరియస్‌గా తీసుకోలేకపోయాం. లారెన్స్‌ను నమ్మి ముందుకు వెళ్లడం వల్లే అంత పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వారు ఓపెన్‌గా అంగీకరించారు. సినిమా మొదటి వారంలో 35 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి, టోటల్‌గా 44 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. దీనివల్ల భారీగా నష్టపోయామని భగవాన్, పుల్లారావు వెల్లడించారు .






