'అష్టదిగ్భంధనం' మూవీ రివ్యూ.. ట్విస్ట్ లు అదిరిపోయాయి!
on Sep 22, 2023
నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
మ్యూజిక్: జాక్సన్ విజయన్
కెమెరా: బాబు కొల్లబత్తుల
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల
ఆర్ట్: వెంకట్
రచన, దర్శకత్వం: బాబా పి.ఆర్
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్
విడుదల తేదీ: సెప్టెంబర్ 22, 2023
థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ట్విస్టులతో ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే నడిపిస్తే ఆడియన్స్ తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ ఫార్ములాను నమ్మి చేసిన సినిమానే 'అష్టదిగ్భంధనం'. బాబా పీఆర్ దర్శకుడు. పలు లఘు చిత్రాలు, సినిమాల్లో నటించిన సూర్య భరత్ చంద్ర హీరోగా నటించాడు. 'రచ్చ' సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట హీరోయిన్‌గా నటించింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ:
శంకర్ అనే రౌడీ షీటర్.. తన తోటి రౌడీ షీటర్ రాజకీయ నాయకుడిగా మారి తననే అవమానిస్తుంటే ఇగో దెబ్బతిని తను కూడా ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 కోట్లు చెల్లించేందుకు శంకర్ సిద్ధమవుతాడు. అందుకోసం పక్కా ప్లాన్ వేస్తాడు. రూ. 50 కోట్ల కోసం అతడు ఎలాంటి పథకం పన్నాడు? హీరోహీరోయిన్లు ఆ పథకంలో ఎలా ఇరుక్కున్నారు? రౌడీ షీటర్ శంకర్‌కు మంత్రి ఇచ్చిన వంద కోట్లు ఏమయ్యాయి? అసలు ఎవరు ఎవరికి స్కెచ్ వేశారు? చివరికి కథ ఎలా సుఖాంతమైంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమో జరిగేది కాదని.. ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరిగేదని ట్రైలర్‌లో చూపించారు. అదే సినిమాలో కనిపించింది. అహం చుట్టుకున్న అల్లుకున్న కథ ఇది. దర్శకుడు బాబా స్క్రీన్ ప్లే ప్రధానంగా, సినిమాని ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్స్ గురించి సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్‌లో వాటికి కన్‌క్లూజన్ ఇచ్చాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. సెకెండాఫ్‌లో దర్శకుడు ఎక్కువ ట్విస్టులను ప్లాన్ చేశాడు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలుగుతుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం సిల్లీగా అనిపించాయి. అలాగే కొన్నిచోట్ల లాజిక్కులు మిస్ అయ్యాయి. సినిమా నిడివిని కూడా కాస్త కుదించి ఉండాల్సింది.
నటీనటుల పనితీరు:
హీరోగా నటించిన సూర్య భరత్ చంద్ర తన నటనతో పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్ విషిక తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. రౌడీ షీటర్ శంకర్ పాత్ర చేసిన అతను విలనిజం బాగా పండించాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
చివరిగా:
కొన్నిచోట్ల లాజిక్కులు మిస్ అయినప్పటికీ.. ట్విస్ట్ లతో ఆసక్తికరంగా నడిచిన ఈ సినిమా.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
