
రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాలేదు. ఏపీ హైకోర్టు సినిమాపై స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీమ్ కోర్టు గడప తొక్కారు. చిత్రానికి సంగీతం అందించిన కల్యాణీ మాలిక్ వంటివారు ఏపీలో సినిమా విడుదల కానందుకు బాధపడ్డారు. అయితే... ఎన్టీఆర్ పాత్రలో నటించిన రంగస్థల నటుడు విజయ్ కుమార్ మాత్రం ఏపీ ప్రజలు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చూశారని అంటున్నారు. ఎలా అంటారా? విజయ్ కుమార్ స్వస్థలం ఏలూరు. అక్కడి ప్రజలు తెలంగాణలోని సత్తుపల్లి వెళ్లి సినిమా చూశారట. అలాగే, ఏపీలో ఇతర ప్రాంతాల ప్రజలు తమకు దగ్గరలో సినిమా ఎక్కడ విడుదలైతే అక్కడికి వెళ్లి చూశారని ఆయన చెబుతున్నారు. తన నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని విజయ కుమార్ తెలిపారు. ప్రేక్షకుల ప్రశంసలు ఒక ఎత్తు అయితే... వర్మ ప్రశంస మరో ఎత్తు. "ఎన్టీఆర్ గారి నటనలో 50 శాతం చేస్తే చాలని అనుకున్నా. మీరు వంద శాతానికి పైగా చేశారు" అని విజయ్ కుమార్ తో వర్మ అన్నారట.






