నేటి కథానాయికలకు ఆమే ప్రేరణ
on Nov 7, 2017
‘సూపర్’ సినిమాలో అనుష్కను చూసినప్పుడు ఆమె తెలుగు సినిమా సూపర్ స్టార్ అవుతుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అసలు ఆ అవకాశమే లేదు. ఎందుకంటే.. స్కిన్ షో తప్ప.. అందులో అనుష్క చేసిందేం లేదు. పైగా అతికించిన ఎక్స్ ప్రెషన్స్. నటన పరంగా విమర్శలు కూడా అందుకుంది అనుష్క.
కానీ.. ఇప్పుడు? చాలామంది కథానాయికలకు ఆమే ఆదర్శం... ప్రేరణ. ‘అనుష్క చేసిన ఫలానా తరహా పాత్ర చేయాలనుంది’ అని చెప్పుకోవడం నేటి కథానాయికలకు పరిపాటైపోయింది. అంటే.. నటిగా అనుష్క ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి అనుష్క అద్భుతమైన సౌందర్యరాశి. గ్లామర్ కథానాయికగా శిఖరాగ్రానికి చేరే అందం ఆమెది. కానీ.. ఆ తరహా పాత్రలకే అంకితం కాలేదు. ఏదో చేయాలని తపించింది. తపస్సు చేసింది. ప్రతిఫలంగా దక్కిన వరమే ‘అరుంధతి’. అక్కడ్నుంచి మొదలైన అనుష్క నట ప్రయాణం అద్భుతాల సమాహారం. వేదం, పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో, బాహుబలి 1,2.. త్వరలో ‘భాగమతి’... ఆ సినిమాలే అందుకు నిదర్శనం.
చివరకు నటిగా ఆమె ఏ స్థితికి చేరుకుందంటే.. పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని స్థితికి. దానికోసం తన ఫిజిక్కుని కూడా పాడుచేసుకంది. దటీజ్ అనుష్క ఎలాంటి పాత్రకైనా సరిపోయే రాచఠీవీ అమెది. అందుకే.. ఇలాంటి గొప్ప పాత్రలు ఈ అందాలరాశిని వరించాయ్. సౌందర్య తర్వాత తెలుగు తెరపై ఆ స్థాయిలో జనాలను ఆకట్టుకున్న తార ఆమె. అందులో నో డౌట్. బేసిగ్గా తాను గొప్ప నటి కాకపోయినా.. కృషితో నాస్తి దుర్భిక్షం.. అనే సూక్తిని తూచ తప్పక పాటించి గొప్ప నటిగా అవతరించిన మేటి నటి అనుష్క. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. ఇలాంటి పుట్టిన రోజు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటోంది తెలుగువన్.