ENGLISH | TELUGU  

ఆల్వేస్ కామెడీ... అనిల్ రావిపూడి ఫిలాసఫీ

on Nov 23, 2019

 

వినోదం... వినోదం... వినోదం... దర్శకుడు అనిల్ రావిపూడి నమ్మిన, నమ్ముతున్న తత్త్వం, మంత్రం ఇదే. వినోదం... అతడు పాటిస్తున్న సూత్రమిదే. వినోదమే అనిల్ రావిపూడికి, అతడిని నమ్ముకున్న హీరోలకు విజయాలు అందిస్తోంది. వినోదాత్మక చిత్రాలతో వరుస విజయాలు అందుకుని, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి పుట్టినరోజు ఈ రోజు. 

అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైనది నందమూరి కల్యాన్ రామ్ 'పటాస్'తో. అవినీతి పోలీస్ అధికారి, నీతిమంతుడిగా ఎలా మారాడు అనేది సినిమా కథ. అందులో యాక్షన్ ఉంది. ఫాదర్ సెంటిమెంట్ ఉంది. కానీ, వినోదమే హైలైట్ అయింది. హీరో అవినీతిలోనూ అనిల్ రావిపూడి వినోదాన్ని చూశారు. లంచం తీసుకోవడం నేరం. లంచాల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి, లంచగొండి అధికారులను చూస్తే ప్రేక్షకులకు కోపం వస్తుంది. 'జనతా గ్యారేజ్'లో లంచాలు తీసుకొని అధికారి రాజీవ్ కనకాల ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడానికి కారణం లంచగొండులపై కోపమే. 'పటాస్'లో హీరో కరెప్షన్ ని కామెడీ చేస్తూ, ప్రేక్షకులను నవ్వించారు అనిల్ రావిపూడి.

సాయితేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సుప్రీమ్' విజయానికీ వినోదమే మెయిన్ రీజన్. సాధారణంగా చూపులేని వారంటే ప్రజల్లో సింపతీ ఉంటుంది. సింపతీని పక్కనపెట్టి, ఓ అంధుడు తనపై తాను సెటైర్ వేసుకుంటే ప్రజలు నవ్వేలా చేయడం అనిల్ రావిపూడికి చెల్లింది. హుషారుకు కేరాఫ్ అడ్రస్ లాంటోడు రవితేజను అంధుడిగా చూపించి 'రాజా ది గ్రేట్' మంచి వినోదం పండించారు అనిల్ రావిపూడి. 'ఎఫ్ 2' గురించి అయితే చెప్పక్కర్లేదు. కామెడీతో వందకోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

అనిల్ రావిపూడి ప్రతి సినిమాలోనూ వినోదం ఉంటుంది. అయితే, కథ ఏమీ ఉండదని కంప్లయింట్ కూడా వినిపిస్తుంటుంది. అలాగే, బుల్లితెర హిట్ కామెడీ షో 'జబర్దస్త్' టైపులో అతడి సినిమాలు ఉంటాయని విమర్శించే వారూ ఉన్నారు. వెండితెరపై రెండున్నర గంటల 'జబర్దస్త్' షో అనిల్ రావిపూడి సినిమాలు అని కామెంట్లు కూడా కొందరి నుండి వచ్చాయి. ఇటువంటి విమర్శల మధ్య 'ఎఫ్ 2'కి వందకోట్లు వచ్చాయంటే... ప్రేక్షకులు అనిల్ రావిపూడి వినోదాన్ని ఆదరించారని అర్థం చేసుకోవాలి. 

'నవ్వడం ఓ భోగం... నవ్వించడం ఓ యోగం... నవ్వకపోవడం ఓ రోగం' అని పెద్దలు అన్నారు. నవ్వించే యోగం అనిల్ రావిపూడిలో ఉంది. నవ్వే భోగం ప్రేక్షకులకు దక్కుతోంది. మున్ముందు ప్రేక్షకులను మంచిగా నవ్వించాలని అనిల్ రావిపూడికి తెలుగువన్ డాట్ కామ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.