వయసేమో 63.. ఫిట్నెస్ చూస్తే 33!
on Oct 24, 2020
అనిల్ కపూర్ పేరు వింటే వెనకటి తరం నటుడనిపిస్తుంది ఎవరికైనా.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన నటుడిగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లోని టాప్ స్టార్స్‌లో ఆయన ఒకరు. ఇప్పుడు ఆయన వయసు 63 సంవత్సరాలు. కానీ ఆ వయసులోనూ ఫిట్టెస్ట్ యాక్టర్‌గా కనిపించడం ఆయనకే చెల్లింది. ఫొటోల్లో ఆయనను చూస్తే.. ఆయనకు అంత వయసుంటుందంటే నమ్మాలనిపించదు. ఆయన ఫిట్‌నెస్‌లో డిసిప్లిన్‌తో కూడిన డైట్ ప్రధాన పాత్ర వహిస్తోంది. షుగర్, జంక్ ఫుడ్ ఆయన డైట్లో నిషిద్ధం. ఆయన డైట్లో పాల ఉత్పత్తులు అధికంగా కనిపిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటలకు ఆయన పడుకుండిపోతారు. తన ఫిట్నెస్ మంత్రను ఇటీవల ఆయన తన అభిమానులతో పంచుకున్నారు.
తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆయన తన కండలను, గుడ్ లుక్స్‌ను ప్రదర్శించే పలు ఫొటోలను షేర్ చేశారు. "బాడీ బిల్డింగ్ విషయానికి వస్తే, మనల్ని దాటి ఏదీ ఉండకూడదు. గొప్ప ఫలితాలను సాధించడానికి భిన్న వయసుల్లో ఉండే మనం భిన్నంగా పని చేయవచ్చు. దీన్ని సాధించడానికి సప్లిమెంట్స్‌కు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అనడిగితే, లేదనేదే నా సమాధానం. ఫిట్నెస్ విషయంలో నేనెప్పుడూ ఎలాంటి సప్లిమెంట్స్ వాడలేదు" అని ఆయన పోస్ట్ చేశారు.
గత ఆరు సంవత్సరాలుగా తన ట్రైనర్ మార్క్ సాయంతో తన బాడీని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నానని అనిల్ తెలిపారు. లాక్డౌన్ పీరియడ్‌ను దీనికి బాగా ఉపయోగించుకున్నానని ఆయనన్నారు. "మీ శరీరాన్ని బలోపేతం చేసుకోండి, కండరాలను పెంచుకోండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి, ఫ్లెక్సిబిలిటీని వృద్ధి చేసుకోండి. మీ శరీరాన్ని గౌరవించండి." అని పిలుపునిచ్చారు అనిల్ కపూర్.