Home

»

Latest News

ప్రేమకథగా మొదలై.. ప్రాణాల కోసం పోరాటంగా మారిన స‌ర్వైవ‌ర్ థ్రిల్ల‌ర్‌.!

Nov 21, 2026 6:39PM

ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల అనుబంధం.. ఇలా మొదలయ్యే కథ ఒక్కసారిగా సర్వైవల్‌ థ్రిల్లర్‌గా మారితే ఎలా ఉంటుంది? తమిళంలో అశోక్‌ సెల్వన్‌, ప్రీతీ ముకుందన్‌ జంటగా నటించిన ‘అన్బిల్ అవన్’ సినిమా ఇలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తికేయన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైంది. నవంబర్‌ 20 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రొమాన్స్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది.

సూర్య (అశోక్‌ సెల్వన్‌), ఇందు (ప్రీతీ ముకుందన్‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ ఉద్యోగ ఒత్తిడిని, అవమానాలను ఎదుర్కొంటుంటారు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో హోమ్‌స్టే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఓ పాత బంగ్లా వారికి నచ్చుతుంది. ఒకప్పుడు రాణి పద్మిని (రేవతి) నివసించిన ఆ బంగ్లాను ఆమె నుంచి సూర్య అతికష్టం మీద కొనుగోలు చేస్తాడు. అయితే ఆ బంగ్లాపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే రాజనాయగం మాత్రం దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు.

బంగ్లా కొనుగోలు చేసినప్పటి నుంచి సూర్య దంపతులకు సమస్యలు మొదలవుతాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడులు చేయడం, పోలీస్‌ అధికారి తవసి కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించడం, ఇందుతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరుగుతాయి. చివరికి సూర్య ఇంట్లో ఏనుగు దంతాలు, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు పెట్టించి అతడిని కేసులో ఇరికించాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఓ హత్యను సూర్య తన ఫోన్‌లో రికార్డు చేయడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.

భార్యను, తాము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని కాపాడుకోవడానికి ఓ సాధారణ యువకుడు చేసే పోరాటం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. రాజకీయ నాయకుడు, వకీలు, పోలీస్‌ అధికారి కలిసి సూర్య దంపతులను చుట్టుముట్టే సమయంలో కథ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్‌ను రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అశోక్‌ సెల్వన్‌, ప్రీతీ ముకుందన్‌ తమ పాత్రల్లో సహజంగా నటించారు. గౌతమ్‌ రాజేంద్రన్‌ కెమెరా పనితనం, గోవింద్‌ వసంత నేపథ్య సంగీతం, కార్తికేయన్‌ టేకింగ్‌ సినిమాకు బలంగా నిలుస్తాయి.

అయితే కథలోని కొన్ని అంశాలు మరింత బలంగా ఉండాల్సింది. రొమాన్స్‌తో మొదలైన కథలోకి థ్రిల్లర్‌ అంశాలు వచ్చిన తర్వాత కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి. అయినప్పటికీ భార్యాభర్తల అనుబంధం, తమ కలను కాపాడుకోవడానికి వారు చేసే పోరాటం, చివరి భాగంలోని ఉత్కంఠ సర్వైవల్‌ థ్రిల్లర్‌ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ జోనర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘అన్బిల్ అవన్’ ఓసారి చూడదగిన చిత్రంగా చెప్పొచ్చు.

 

 

[AnbilAvan, SonyLIV, AshokSelvan, Preity Mukhundhan, TamilSurvivalThriller]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com