దర్శకులతో అల్లు అర్జున్ కుర్చీలాట!
on Sep 21, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకులతో మ్యూజికల్ చైర్ ఆడుతున్నాడా అంటే, అవుననే అనిపిస్తోంది. కొంతకాలంగా ఆయన దర్శకులను తన చుట్టూ తెగ తిప్పుకుంటున్నారు. ఫలానా దర్శకుడు చెప్పిన కథ బన్నీకి నచ్చింది, నెక్స్ట్ సినిమా ఆయనతోనే అని న్యూస్ రావడం.. కొంతకాలానికి ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్ళిపోయింది అంటూ మరో దర్శకుడి పేరు తెరపైకి రావడం. ఈ రెండు మూడేళ్లలో ఇలా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి.
మొదట బన్నీ తన 21వ సినిమాని కొరటాల శివతో ప్రకటించాడు. ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకనో లేక మరో కారణమో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి బన్నీ తప్పుకున్నాడు. దీంతో కొరటాల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో 'దేవర' సినిమా చేస్తున్నాడు. అలాగే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో 'ఐకాన్' అనే సినిమా చేయడానికి ఓకే చెప్పిన బన్నీ.. ఆ తర్వాత డ్రాప్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' చేస్తున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. ఈ గ్యాప్ లో ఇండియా వైడ్ గా పలువురు దర్శకులు బన్నీని సంప్రదించారు. ఆ లిస్టులో బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, రోహిత్ శెట్టి, మురగదాస్, లింగుసామి, పుష్కర్-గాయత్రి వంటి వారున్నారు. ఇక ఇటీవల అట్లీ పేరు బలంగా వినిపించింది. రేపో మాపో ప్రకటనే అన్నట్టుగా ప్రచారం జరిగింది. తీరా ఇప్పుడు అట్లీ ప్లేస్ లో నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఇప్పుడు నెల్సన్ కూడా డౌటే అంటున్నారు. అసలే బన్నీ స్టార్. దానికితోడు 'పుష్ప'తో పాటు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోవడంతో దర్శకులు బన్నీతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు. కానీ బన్నీ మాత్రం ఏమాత్రం తొందర, మొహమాటం లేకుండా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ దర్శకులతో ఓ ఆట ఆడుకుంటున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
