ఏఎన్నార్.. అత్యధిక పాత్రల రికార్డ్!
on Jan 22, 2021

తెలుగు చిత్రసీమలో ఒకే చిత్రంలో అత్యధిక పాత్రలను పోషించిన రికార్డ్ ఎవర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరావు పేరు మీదే ఉంది. 1966లో వచ్చిన 'నవరాత్రి' చిత్రంలో ఆయన ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. టైటిల్‌లోని నవ రాత్రుల్లో నవ పాత్రల్లో ఆయన దర్శనమిస్తారు. తాతినేని రామారావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నవరసాలను ఒక్కో పాత్రలో అనితరసాధ్యంగా పోషించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ అమితంగా పొందారు.
ఈ చిత్రంలో నాగేశ్వరరావు పోషించిన తొమ్మిది పాత్రలు.. ఆనందరావు, రైతు శాంతన్న, దేవదాసు, డాక్టర్ కరుణాకర్, కోపిష్టి గోపన్న, భాగవతార్ శ్రీనివాసులు, కుష్ఠురోగి రామయ్య, పోలీసాఫీసర్ వీరభద్రరావు, ప్రేమికుడు వేణు. క్లైమాక్స్‌లో వేణు పాత్రధారి పెళ్లికి ఏడు పాత్రలు వచ్చి ఆశీర్వదించడం ఓ విశేషం. ఓ సందర్భంలో వచ్చే సతీసావిత్రి నాటకంలో సత్యవంతుడి పాత్రలోనూ అక్కినేని కనిపిస్తారు.
ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు.. సావిత్రి, జమున, జయలలిత, కాంచన నటించగా, సూర్యకాంతం, జగ్గయ్య, చలం, నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, ప్రభాకరరెడ్డి, రుష్యేంద్రమణి, ఛాయాదేవి, గిరిజ లాంటి ఉద్ధండ నటీనటులు ఇతర పాత్రలను పోషించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అనుమోలు వెంకటసుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదలై విజయం సాధించింది.
ఇది 1964లో శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం 'నవరాత్రి'కి రీమేక్. రెండు సినిమాల్లోనూ సావిత్రి అదే పాత్రను పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



