నా ఫ్యాన్ నాకన్నా ఫేమస్ అయ్యాడు.. ఆయన్ని త్వరలోనే కలుస్తా: అఖిల్
on Oct 19, 2021
సినీ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం సహజం. కానీ హీరో ఫ్యాన్ కి ఫాలోయింగ్ ఉండటం అరుదు. అది అక్కినేని అఖిల్ ఫ్యాన్ నాగరాజు విషయంలో జరిగింది. నాగార్జున నటించిన 'రాజు గారి గది2' విడుదల సమయంలో నాగరాజు వెలుగులోకి వచ్చాడు. 'ఎవరివల్లా కాదు.. అఖిలే కరెక్ట్.. అయ్యగారే నెంబర్ వన్' అంటూ అతను చెప్పిన డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత అఖిల్ నటించిన 'హలో' తో పాటు, అక్కినేని హీరోల సినిమాల రిలీజ్ టైంలో థియేటర్స్ దగ్గర 'అయ్యగారే నెంబర్ వన్' అంటూ నాగరాజు హంగామా చేశాడు. దీంతో సోషల్ మీడియాలో అతను చాలా ఫేమస్ అయ్యాడు. అఖిల్ ని అందరూ అయ్యగారు అని పిలవడం స్టార్ట్ చేశారు. అయ్యగారి కంటే అయ్యగారి ఫ్యానే బాగా ఫేమస్ అయ్యాడు అంటూ మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అఖిల్ సైతం తనకంటే తన ఫ్యానే ఎక్కువ పాపులర్ అయ్యాడని అంటున్నాడు.
అఖిల్ హీరోగా నటించిన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' దసరా కానుకగా ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అఖిల్ కి ఫస్ట్ హిట్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక అఖిల్ ఫ్యాన్ నాగరాజు అయితే సినిమా రిలీజ్ రోజు మాములు హంగామా చేయలేదు. ధియేటర్ దగ్గర అఖిల్ ని పులి అంటూ మీసం మెలేశాడు. ఓ రకంగా మూవీ రిలీజ్ రోజు సోషల్ మీడియాలో అఖిల్ కంటే అతను గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు. తాజాగా అఖిల్ కూడా అతని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' విజయోత్సాహంలో అఖిల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అయ్యగారు ప్రస్తావన రాగా అఖిల్ నవ్వుతూ నాగరాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఆయన నాకన్నా ఎక్కువ పాపులర్ అయ్యాడు. అతని వీడియోలు చూశాను. ఖచ్చితంగా ఆయన్ని ఒకసారి కలవాలి. 'అయ్యగారు' అనే పదం నా లైఫ్ ని టేక్ ఓవర్ చేసింది. ఈ పదం మా సినిమాలో పెట్టుకున్నాం. నా ఫ్యాన్ ఇంత పాపులర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు క్షేమంగా ఉండండి బ్రదర్. ఎప్పుడూ ఇంతే ఉత్సాహంగా ఉండండి. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను" అని అఖిల్ అన్నాడు.
తన ఫ్యాన్ గురించి అఖిల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తనకంటే తన ఫ్యాన్ ఎక్కువ పాపులర్ అయ్యాడని అఖిల్ అనడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read