అఖిల్ "హలో" కాపీ అట.. పీకీ పారేసిన యూట్యూబ్..!!
on Nov 29, 2017
అక్కినేని అఖిల్-విక్రమ్ కుమార్ కాంభినేషన్లో తెరకెక్కిన చిత్రం హలో.. తొలి మూవీ అఖిల్ అట్టర్ ఫ్లాప్ కావడంతో తన కొడుకు చేత ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టించాలన్న కసితో నాగ్ దగ్గరుండి మరి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. అటు మాస్.. ఇటు క్లాస్ ఎలిమెంట్లు ఉండేలా కథను డిజైన్ చేశారు నాగార్జున. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో సహా అన్ని పనులు పూర్తి చేసుకొని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా రిలీజైన టీజర్లో యాక్షన్, లవ్, రొమాంటిక్ సీన్లను అఖిల్ బాగా డీల్ చేయడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్ భారీగా పెరిగాయి.
దీన్ని మరింత పెంచేందుకు ప్రమోషన్స్ కార్యక్రమాలను స్పీడప్ చేయాలనుకుంటున్న వేళ అక్కినేని ఫ్యామిలీకి షాకిచ్చింది యూట్యూబ్. హలో టీజర్‌ను తమ సైట్ నుంచి డిలీట్ చేసింది. ఈ సినిమాకు ఉపయోగించిన సౌండ్ ట్రాక్స్‌ను తమ ఒరిజనల్ ట్రాక్స్ నుంచి కాపీ కొట్టారని "రియల్లీ స్లో మోషన్", "ఎపిక్ నార్త్" సంస్థలు సాక్ష్యాధారాలతో సహా యూట్యూబ్‌ను ఆశ్రయించాయి. క్రాస్ చెక్ చేసుకున్న యూట్యూబ్ మేనేజ్మెంట్ హలో టీజర్‌ను తొలగించింది. మధ్యాహ్నం హలో టీజర్‌ను చూద్దామని యూట్యూబ్‌లో బ్రౌజ్ చేసిన నెటిజన్లకు " this video is unavailable " అన్న మ్యాటర్ స్క్రీన్ మీద కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి దీనిపై నాగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.