'విక్రమ్', 'జైలర్'.. సేమ్ టు సేమ్!
on Jun 23, 2022
రీసెంట్ గా రిలీజైన `విక్రమ్`తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు లోక నాయకుడు కమల్ హాసన్. ఈ నేపథ్యంలో.. తన సమకాలీనుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రం `జైలర్`పై అందరి దృష్టి ఉంది. ఈ సినిమాతో రజినీ కూడా కమల్ లా కమ్ బ్యాక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో అన్నట్లుగా కోలీవుడ్ ఎదురుచూస్తోంది. దానికి తోడు.. `విక్రమ్`, `జైలర్`కి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే. `విక్రమ్` ఎలాగైతే ఆ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కి నాలుగో ప్రయత్నమో.. `జైలర్` కూడా ఆ సినిమా కెప్టెన్ నెల్సన్ దిలీప్ కుమార్ కి నాలుగో ప్రయత్నమే. అంతేకాదు.. లోకేశ్ తన మూడో సినిమాని విజయ్ తో `మాస్టర్`గా తీర్చిదిద్దితే, నెల్సన్ కూడా తన థర్డ్ వెంచర్ ని విజయ్ కాంబినేషన్ లోనే `బీస్ట్`గా రూపొందించాడు. అలాగే, లోకేశ్ నాలుగో చిత్రం `విక్రమ్`కి అనిరుధ్ బాణీలు అందిస్తే.. నెల్సన్ నాలుగో సినిమా `జైలర్`కి కూడా అతని ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ నే స్వరకర్త. మరి.. అనిరుధ్ సమేతంగా కమల్ కాంబినేషన్ లో తన నాలుగో సినిమా చేసి లోకేశ్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.. నెల్సన్ కూడా రజినీ కాంబినేషన్ లో తన నాలుగో ప్రయత్నంతో అదే బాట పడతాడేమో చూడాలి. కాగా, 2023లో రజినీకాంత్ `జైలర్` జనం ముందుకు రానుంది.