పాపం కోలీవుడ్.. ఈసారి కూడా వెయ్యి కోట్లు కష్టమేనా..?
on Jul 7, 2025

కోలీవుడ్ కి వెయ్యి కోట్ల క్లబ్ అనేది అందని ద్రాక్షలా మారింది. టాలీవుడ్ నుంచి 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్', 'కల్కి', 'పుష్ప-2' ఇలా ఏకంగా నాలుగు సినిమాలు వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నాయి. హిందీ, కన్నడ పరిశ్రమలు కూడా ఈ ఫీట్ సాధించాయి. కానీ, తమిళ్ ఇండస్ట్రీ మాత్రం వెయ్యి కోట్ల సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న 'కూలీ'పైనే వారి ఆశలన్నీ ఉన్నాయి.
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం 'కూలీ'. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అసలే రజినీ-లోకేష్ కాంబినేషన్.. దానికి తోడు పలువురు స్టార్స్ భాగం కావడంతో.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'కూలీ'తో కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమా రాబోతుందని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. దీంతో అసలిది నిజంగా సాధ్యమవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అదే రోజు మరో భారీ చిత్రం 'వార్-2' విడుదలవుతోంది.
వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. కానీ, 'వార్-2' వల్ల 'కూలీ'కి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడే ఛాన్స్ ఉంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా పక్కా బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో.. నార్త్ మార్కెట్ లో 'వార్-2' డామినేట్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ ఉన్నాడు కాబట్టి.. తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ 'వార్-2'నే అవుతుంది. దాంతో 'కూలీ' కలెక్షన్స్ పై బాగానే ప్రభావం పడుతుంది. ఇక యూఎస్ లోనూ 'కూలీ' కలెక్షన్స్ కి భారీగా గండిపడే ఛాన్స్ ఉంది.
ఒక్క తమిళనాడులో మాత్రం 'కూలీ' పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. పాజిటివ్ టాక్ వస్తే.. అక్కడ రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం పెద్ద విషయం కాదు. అయితే హిందీ, తెలుగు, యూఎస్ మార్కెట్ లలో వార్-2 ప్రభావం కారణంగా.. మిగతా చోట్ల కూలీ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టడం కష్టమే. అదే జరిగితే.. కోలీవుడ్ కి మరోసారి వెయ్యి కోట్ల మార్క్ మిస్ అయినట్లే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



